దిశ దశ, దండకారణ్యం:
విప్లవోద్యమం వైపు అడుగులు వేసిన వారి జాడ ఏమైంది..? విదేశాలకు వెళ్లారా..? స్వదేశంలో ఉన్నారా..? అజ్ఞాతంలోనే ఉండిపోయేరా..? జనాలతో మమేకం అయ్యారా..? మారు వేషంలో జీవిస్తున్నారా..? వారి మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. జన జీవనంలో కలుస్తున్న మావోయిస్టుల గణాంకాలు వెలుగులోకి వస్తున్నా వెలుగులోకి రాని ఆ విప్లవకారుల జాడ ఏమైంది..? వారి ఆచూకి దొరుకుతుందా..? కనీసం ఉనికైనా బయట పడుతుందా లేదా అన్నదే అంతు చిక్కకుండా పోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా…
ఎర్ర జెండా ఎత్తుకుని పోరాట బాట పట్టిన వారిలో కీలకమైన నాయకుల నుండి సాధారణ సభ్యుని వరకూ కూడా వందాలాది మంది జనారణ్యంలోకి వస్తున్నారు. కేంద్ర కమిటీ నుండి క్షేత్ర స్థాయి వరకు పని చేసిన ప్రతి ఒక్కరు కూడా బాహ్య ప్రపంచలోకి వస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఉద్యమం కనుమరుగైపోతున్న వేళ అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ అన్నల జాడ మాత్రం తెలియరావడం లేదు. పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయినప్పుడు మరణిస్తే ఈ సమాచారం నాయకత్వం సమాచారం ఇచ్చేది. అరెస్ట్ చేసినా ఎన్ కౌంటర్ లో చనిపోయినా పోలీసులు ప్రకటించే వారు. కానీ అలాంటి ప్రకటనలేవీ విడుదల కాకపోవడంతో వారేమయ్యారన్నదే అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. తెలంగాణగాకు చెందిన వారు ఐదుగురు మాత్రమే మిగిలిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. అయితే జాడ లేకుండా పోయిన 35 మంది ఆచూకి మాత్రం తెలియకుండా పోవడం ఆందోళన కల్గిస్తోంది. 2024 నుండి పార్టీతో కాంటాక్ట్ లేకుండా పోయిన ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ఆయన భార్య సుజాతల గురించి ప్రకటించారు. పార్టీతో దూరంగా ఉన్న వార్త శేఖర్, రూపీ దంపతులు కూడా ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ 35 మంది మిస్సింగ్ మిస్టరీ మాత్రం ఛేదించడం కష్టతరంగా మారిపోయింది. పార్టీతో సంబంధాలు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్న వారి ఆచూకి కూడా లభ్యమైన సంఘటనలు లేకపోలేదు. మహారాష్ట్రలోని సిరొంచ ఏరియా కమిటీ కార్యదర్శి, ఆయన భార్య పార్టీకి దూరంగా జీవనం సాగిస్తున్నారు. వారి జాడ తెలుసుకున్న గడ్చిరోలి జిల్లా పోలీసులు హైదరాబాద్ గచ్చిబోలిలోని ఓ షోరూంలో హౌజ్ కీపింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. దశాబ్దం తరువాత కూడా వీరిని పట్టుకోవడంలో సఫలం అయినా తెలంగాణాకు చెందిన 35 మంది గురించి మాత్రం ఏ మాత్రం సమాచారం లేకుండా పోవడం గమనార్హం. మావోయిస్టు పార్టీలోనే తమ వారు ఉన్నారని అనుకున్న ఆయా కుటుంబాలకు చెందిన వారు తమ వారి గురించి తెలియరావడం లేదని మధనపడిపోతున్నారు. అయితే తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో పేర్లు మార్చుకుని పాస్ పోర్టులు తీసుకుని విదేశాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా పాస్ పోర్టులు తీసుకుని ఎవరైనా వెళ్లిపోయారా అన్న అనుమానం వస్తున్నా… సంబంధిత కుటుంబాల ద్వారా ఈ విషయం ఎప్పుడో ఓ సారి బయటపడేది కదా అన్న చర్చ కూడా సాగుతోంది.
రికార్డుల్లోనూ…
ఇకపోతే పోలీసు రికార్డుల్లో లేని వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ఇటీవల మరో విషయం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తికి చెందిన కాంతారావు కూడా పార్టీలోనే ఉన్నట్టుగా ఆయన అన్న ఓ వీడియో విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ దృష్టిలో పెట్టుకుని బాహ్య ప్రపంచంలోకి రావాలని కాంతయ్యను కోరారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కాంతయ్య నుండి ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. పోలీసు రికార్డుల్లో లేకుండా, మావోయిస్టు నాయకత్వంతో సంబంధాలు లేకుండా పోయిన వారు పరిస్థితి ఏంటన్నది అంతు చిక్కుండానే పోయింది.