Maoist news: అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే… పార్టీ నిర్ణయం కాదు…

తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ మరో లేఖను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఇది కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అలియస్ సోనూ దాదా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కానీ పార్టీ నిర్ణయం మాత్రం కాదని జగన్ స్పష్టం చేశారు. 2024లో పార్టీ పొలిట్ బ్యూరో జారీ చేసిన సర్క్యూలర్ ను అమలు చేయడమే తక్షణ కర్తవ్యమని, అభయ్ విడుదల చేసిన ప్రకటన పార్టీ అధికారిక ప్రకటన కాదని పేర్కొన్న జగన్ విప్లవ శిబిరాలు కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా హత్యకాండను కొనసాగిస్తున్నదని, బీజేపీ నాయకులు కూడా చర్చలు జరిపేది లేదని ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని బీజేపీ నాయకులు పదే పదే చెప్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెల రోజుల సమయం కావాలని అడగడం అనాలోచితమైన చర్య అని అన్నారు. ఆయుధాలు వదిలేసే విషయంలో సోనూ దాదా నెల రోజుల్లో అభిప్రాయాలు తెలపాలని మెయిల్ ఐఢీ ఇవ్వడం ఏ పద్దతో అర్థం కావడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని విడిచిపెట్టాలని అనుకున్నట్టయితే ఆయన పార్టీ అనుమతి తీసుకుని వెళ్లిపోవచ్చని సూచించారు. తన అభిప్రాయాలను పార్టీ ఛానెల్ ద్వారా పంపించినట్టయితే ఆయన ప్రశ్నలకు జవాబులు దొరికేవని, కానీ బహింరగంగా ప్రకటించడం వల్ల పార్టీ శ్రేణులతో పాటు విప్లవ శిబిరంలో గందరగోళం తలెత్తుతోందన్నారు. ఆయన అనుసరించిన పద్దతి పార్టీకి లాభం చేకూర్చకపోగా నష్టం కల్గిస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏ పార్టీ కూడా ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చ పెట్టదని, రహస్య పార్టీ కేంద్రీకృత సూత్రాలకు కట్టుబడిన పార్టీ తీవ్రమైన దమనాకాండ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగా ఆలోచించే వారు ఇలా చేయరంటూ జగన్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై పై స్థాయి నుండి కింది స్థాయి వరకు సీరియస్ గానే ఆలోచిస్తున్నారని, అనవసరంగా నష్టపోవాలని ఎవరూ అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బహింరంగ ప్రకటనలో ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. విప్లవ శిబిరాలు రాజకీయ పార్టీలు అభయ్ ప్రకటనను అధికారికంగా విడుదల చేసిన ప్రకటనగా భావించాల్సిన అవసరం లేదన్నారు.

జగన్ విడుదల చేసిన పూర్తి ప్రకటన

భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ

పత్రికా ప్రకటన

కామ్రేడ్ సోనూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే గాని పార్టీ నిర్ణయం కాదు.

ప్రియమైన ప్రజలారా!

కేంద్రంలోని బిజెపి పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుండో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, క్యాడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2025 మార్చిలో కొంత మంది ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనను చేసింది. ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ-కూంబింగులు, హత్యాకాండ ఆపాలని కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూ రక్తపు టేరులు పారిస్తూనే ఉంది. కేంద్ర హోమ్ మంత్రి బా హాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తానని పదే పదే ప్రకటించాడు. మరొక వైపున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ప్రజా సంఘాలు, ప్రజలు కగార్ యుద్ధ కాండను నిలుపుదల చేయాలని ఆందోళన చేశారు. గారు యద్ద కాండను ఆపాలని దేశ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విషయం మీద సభలు జరిగాయి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ద కాండను ఆపాలని పెద్దఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగాయి. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీమ్ మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లలో ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెమ్ బాలకృష్ణ, పర్వేశ్ సోరెన్ (జార్ఖండ్), లు అమరులు అయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతం, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ మొదలగువారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితోల్లో కొంత మంది రాష్ట్ర కమిటీ సభులు, క్రింది స్థాయిల కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు.
దేశ వ్యాప్తంగా కగార్ ను నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తోంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ, మరొక పక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగటం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోనూ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని, పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్ కు పంపాలని కోరుతూ ప్రకటన ఇచ్చాడు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్ధతి అనాలో అర్థం కావటం లేదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలసి లీగల్ గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్ లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయక పోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుంది. తాను అనుసరించిన పద్దతి ఉద్యమానికి ఉపయోగ పడకపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరు అలా చేయరు. అటువంటిది రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోసించే వాళ్లు ఇలా చేయరు. నేడు పార్టీలో పై స్థాయి నుండి క్రింది వరకు నేడు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్ట పోవాలని ఎవరు అనుకోవటం లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా బహిరంగా ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పటికీ ఇప్పుడే పరిష్కారం దొరకక పోవచ్చు. 2024లో పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో నేడు మారణకాండ జరుగుతున్నదో ప్రపంచ వ్యాప్తంగా అర్థం అవుతుంది. అనగా ప్రపంచ వ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతుంది. ఇంటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలి.

జగన్

అధికార ప్రతినిధి

chhattisgarhDANDKARNYAMjaganmaoist newsMAOIST PARTY