TG టు CG వయా కర్రె గుట్టలు…

బలగాల వ్యూహం…

దిశ దశ, ములుగు:

మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ అయిన కర్రె గుట్టల మీదుగా రోడ్డు నిర్మాణం జరగుతోంది. తెలంగాణలోని పామునూరు నుండి చత్తీస్ గడ్ లోని తడపాల వరకు రహదారి వేసే పనిలో నిమగ్నం అయ్యాయి బలగాలు. ఇందులో భాగంగానే వివిధ రంగాల్లో సుశిక్షుతులగా ఉన్న జవాన్లను కర్రె గుట్టలపై మోహరించినట్టుగా తెలుస్తోంది.

భారీ వ్యూహం…

గత సంవత్సరం జనవరిలో మావోయిస్టులకు మెయిన్ షెల్టర్ జోన్ గా ఉన్న కర్రె గుట్టలపై భద్రతా దళాల దృష్టి పడింది. ఈ గుట్టలను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంగా ఏప్రిల్, మే నెలలో భారీ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. సహజ సిద్దంగా ఏర్పడిన వనరులతో పాటు సహజంగా ఏర్పడిన సొరంగాలు, వన సంపద విస్తరించి ఉన్న కర్రె గుట్టలను సునిశితంగా పరిశీలించిన ఉన్నతాధికారులు దానిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో కర్రె గుట్టలపై షెల్టర్ తీసుకునే మావోయిస్టులు అక్కడి నుండి వెళ్లిపోవడంతో బలగాలు అణువు అణువు తనిఖీలు చేపట్టాయి. మందుగుండు సామాగ్రిని గుర్తించిన బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని పామునూరు మీదుగా, చత్తీస్ గడ్ లోని తడపాల మీదుగా కేంద్ర రిజర్వూ బలగాలు కర్రె గుట్టలపై రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. ఈ ఏడాది జనవరి 26న ఇరువైపులా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో గణతంత్ర వేడుకలు కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ శాశ్వత రోడ్డు నిర్మాణం జరపాలన్న లక్ష్యంతో బలగాలు ముందుకు సాగుతున్నాయి. సాధారణ కూంబింగ్ జరిపే బలగాలతో పాటు క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), రోడ్ సైడ్ కూంబింగ్ ఆపరేషన్ టీమ్స్ (RSCO), మైన్ డిఫ్యూజ్ పార్టీలు ఇలా ఆయా విభాగాల్లో నిష్ణాతులుగా ఉన్న బలగాలు అక్కడ పని చేస్తున్నాయి. ప్రధానంగా బాటిల్ బాంబ్స్, మందు పాతరలను పెద్ద ఎత్తున గుర్తిస్తున్న బలగాలు వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. వేల సంఖ్యలో బాటిల్ బాంబ్స్, మందు పాతరలను మావోయిస్టులు అమర్చినట్టుగా బలగాలు గుర్తించడంతో వాటిని డిఫ్యూజ్ చేస్తూ తొలగిస్తున్నాయి. పేలుడు పదార్థాల నిర్వీర్యం ప్రక్రియ పూర్తి కాగానే శాశ్వత రోడ్డు నిర్మాణం జరిపనున్నట్టుగా సమాచారం.

ట్రైనింగ్ క్యాంప్…

మార్చి నెలలో ఈ ఆపరేషన్ పూర్తి చేసిన తరువాత కర్రె గుట్టలపై ప్రత్యేకంగా ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే భవిష్యత్తులో నక్సల్స్ కార్యకలాపాలకు అస్కారం లేకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అత్యంత ఎత్తుగా ఉన్న ఈ గుట్టల మీదుగా పరిశీలించినట్టయితే మావోయిస్టుల ఉనికి కనిపించే అవకాశాలు ఉంటాయని కూడా గుర్తించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల ఉనికికి ఏ మాత్రం అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

chhattisgarhDKSZCKARRE GUTTAmaoist newsMAOIST PARTY
Comments (0)
Add Comment