బెస్ట్ టీచర్ అవార్డుల ఎంపిక తీరు…
దిశ దశ, హైదరాబాద్:
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం విచిత్రంగా ఉంది. ఉన్నతాధికారులు జిల్లాలకు పంపించిన ప్రొసిడింగ్స్ ను పరిశీలిస్తే బెస్ట్ టీచర్ అవార్డుల ఎంపిక తీరుపై వారికి ఉన్న శ్రద్ద ఏంటో ఇట్టే అర్థం అవుతోంది.
వారం రోజులే…
ప్రతి సెప్టెంబర్ 5న రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఇదే పద్దతిని అవలంభించేందుకు డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ప్రొసిడింగ్స్ ఇచ్చింది. ఆగస్టు 11న విడుదల అయిన ఈ ఉత్తర్వుల్లో రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీ, పాఠశాలల రీజనల్ జాయింట్ డైరెక్టర్, డీఈఓలకు దిశా నిర్దేశం చేస్తూ పంపించింది. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, డీఈఓ, డైట్ ప్రిన్సిపల్ కలెక్టర్ ప్రతిపాదించిన జిల్లా స్థాయి అధికారి ఉండాలని, బెస్ట్ టీచర్ అవార్డుకు ప్రతిపాదనలు చేస్తున్న వారికి సంబంధించిన జాబితాను స్క్రూటినీ చేసి పంపించాలని ఆ ఆదేశాల సారాంశం. ప్రతి జిల్లా నుండి మూడు ప్రతిపాదనలు పంపించాలని ఇదే విధంగా ఇతర విభాగాలకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ను రూపొందించి పంపించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు 18వ తేది లోగా తమ కార్యాలయానికి పంపించాలని కూడా స్పష్టం చేసింది. అయితే కొన్ని జిల్లాల డీఈఓలు రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు చేరాల్సిన వివరాలను పొందు పర్చారు కానీ, జిల్లాల్లో చివరి తేదిని నిర్ణయించకపోవడం కూడా ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది.
సాధ్యమా..?
విద్యాశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న ఈ వింత నిర్ణయాలు అత్యంత విచిత్రంగానే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్5 టీచర్స్ డేను పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసేందుకు 25 రోజుల ముందు ప్రొసిడింగ్స్ పంపించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది వారికే తెలియాలి. ఈ నెల 11న డైరక్టర్ కార్యాలయం నుండి విడుదలయిన ఈ ఉత్తర్వులను అనుసరించి ఈ నెల 18లోగా పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు భారీగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆగస్టు 15ను పురస్కరించుకుని పాఠశాలల్లో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతుంటుంది. మరో వైపున ఈ నెల 16న కృష్ణాష్టమి సెలవు దినం కాగా మరునాడు ఆదివారం సెలవు దినం కావడం గమనార్హం. అయితే ఆయా జిల్లాల నుండి వచ్చిన ఈ ప్రతిపాదనల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఉత్తర్వులను ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు సర్క్యూలేట్ ఎప్పుడు చేయాలి, ఆయా పాఠశాలల నుండి వచ్చే ప్రతిపానలను ఎప్పుడు స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుందోనన్నది పాఠశాలల విద్యాశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. జిల్లా కమిటీలో కలెక్టర్ ప్రతిపాదించే అధికారికి సంబంధించిన ప్రక్రియ కూడా చకాచకా జరగాల్సి ఉంటుంది. ఉత్తమ ఉపాధ్యాయులు తమకు సంబంధించిన వివరాలను ఆధారలను పొందుపర్చడం, ప్రతిపాదనలపై హెచ్ఎంల నుండి లేఖలు తీసుకోవడం, డీఈఓ కార్యాలయాలకు చేరడానికి కూడా ఎంత సమయం పడుతుందోనన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. గతంలో నెల రోజుల ముందే ఉత్తర్వులు వెలువడేవని ఈ సారి మాత్రం వారం రోజుల్లోనే డైరక్టర్ కార్యాలయానికి చేరాలని సూచించడం ఏంటని అంటున్నారు కొందరు ఉపాధ్యాయులు.
కేంద్ర ఇలా…
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కోసం ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలోనే ఉత్తర్వులు విడుదల చేసింది. అదే సమయంలో రాష్ట్రంలో కూడా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు చొరవ ఎందుకు తీసుకోలేదో అంతుచిక్కకుండా పోతోంది. రోటీన్ గా నిర్వహించే కార్యక్రమాల విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల సేవా భావంతో ఉన్న తాము సకాలంలో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్న ఆవేదన ఉపాధ్యాయుల్లో నెలకొంది. తక్కువ సమయం కెటాయించి ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెలవులు, వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.