మంత్రి సీతక్కను కోరిన కరీంనగర్ పోలీసులు…
దిశ దశ, కరీంనగర్:
శాంతి భద్రతల పరిరక్షణలో తలముకలవుతున్న తమను ఆదుకునేందుకు చొరవ తీసుకోవాలని కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మంత్రి సీతక్కను అభ్యర్థించారు. ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలను ఇప్పించి తమను ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని వేడుకున్నారు. విజయ దశమి పర్వదినం వరకు ప్రభుత్వం నుండి తమకు రావల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు గురువారం రాష్ట్ర మంత్రి సీతక్కను కలిశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన సందర్భంగా తమ గోడును వెల్లబోసుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న పోలీసు యంత్రాంగం విషయంలో జరిగిన వివక్ష వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 పే రివిజన్ కమిషన్ బకాయిలు అన్ని విభాగాలకు చెల్లించినప్పటికీ కరీంనగర్ పోలీసు యంత్రాంగానికి మాత్రం అందలేదని సంఘం ప్రతినిధులు వివరించారు. 2024 నుండి తమకు సరెండర్, అడిషనల్ సరెండర్స్, ఆరు నెలల ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు ఇంతవరకు తమ చేతికి అందలేదని తెలిపారు. 2023 నుండి ట్రావెలింగ్ అలవెన్సులు కూడా ఇవ్వలేదని తమకు ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలన్నింటిని ఇప్పించి ఆర్థిక సమస్యల నుండి గట్టెంకించాలని జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు.