Karimnagar: నాడు వైద్యం… నేడు విద్య… బండి సంజయ్ ప్రత్యేక చొరవ…

దిశ దశ, కరీంనగర్:

జన్మదినోత్సవం అనగానే అనుచరులచే కేకులు కట్ చేయించడం… ఊరూ వాడ సంబరాలు చేయడంతో అంబరమంతా ఎత్తుకు ఎదిగామని సంతృప్తి పడడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తమ నేత ప్రాపకం పొందాలన్న తపనతో కార్యకర్తలు ఉత్సుకత చూపించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే… నాయకులు కూడా ఈ సంస్కృతిని అస్వాదిస్తుంటారు. అయితే కరీంనగర్ నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం తన బర్త్ డే సెలబ్రేషన్స్ వైవిద్యంగా జరుపుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ప్రత్యేక సేవలు అందించేందుకు చొరవ తీసుకోవడంలో ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు.

స్పెషాలిటీ ఇదే…

ఎంపీగా రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో బండి సంజయ్ తన జన్మదినం సందర్బంగా ఏడు సెగ్మెంట్లలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న ఆలోచనతో ఫ్రీజర్లు, ఇతరాత్ర మెడికల్ ఎక్విప్ మెంట్స్ అందించారు. అనారోగ్యం బారిన పడిన వారిని సత్వరమే ఆసుపత్రులకు తరలించేందుకు సంజయ్ సురక్ష పేరిట అంబూలెన్స్ లను అందించారు. ఇలా తన బర్త్ డే సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.

తాజాగా…

ఈ నెల 11న బండి సంజయ్ జన్మదిన పురస్కరించుకుని మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్దం చేశారు. కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు సైకిళ్ళను అందించాలని భావించారు. మోదీ కానుక పేరిట నియోజకవర్గ వ్యాప్తంగా సైకిళ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర మంత్రి 20 వేల సైకిళ్లను తయారు చేయించాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో 3096, రాజన్న సిరిసిల్లలో 3841, జగిత్యాలలో 1137, సిద్దిపేటలో 783, హన్మకొండలో 491 మొత్తంగా 9349 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరితో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒక్కో డివిజన్ కు 50 చొప్పున, హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మునిసిపాలిటీలలో ఒక్కో వార్డుకు 50 చొప్పున, పంచాయితీల వారిగా 10 నుండి 25 చొప్పున సైకిళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో సైకిల్ కు రూ. 5,300 ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులు మెరిట్ సాధించడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణ తరగతులతో పాటు స్పెషల్ క్లాసులు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్కుళ్లకు వెల్లిరావడానికి పదో తరగతి విద్యార్థులకు రవాణా సౌకర్యాలు ఉండడం లేదని గమనించి సైకిళ్లను అందించాలని నిర్ణయించారు. జన్మదినం పురస్కరించుకుని హంగు, అర్బాటాలు చేస్తూ వృధా ఖర్చులు పెట్టడం కంటే విద్యా, వైద్య రంగాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తనవంతు చేదోడుగా నిలిచే ప్రయత్నం చేయడం ఆదర్శంగా నిలుస్తోంది. 

bandi sanjaybjp newskarimnagartelangana newsTG NEWS