దసరా బంపర్ ఆఫర్… మెగా లక్కి డ్రా

ధర్మపురిలో ఓ వ్యాపారి డిఫరెంట్ బిజినెస్

దిశ దశ, జగిత్యాల:

దసరా వచ్చిందంటే చాలు… తెలంగాణా అంతటా కూడా జరిగే సందడి అంతా ఇంతా కాదు. విజయ దశమి పురస్కరించుకుని తెలంగాణ పల్లె నుండి పట్నం వరకు కూడా చుక్క, బొక్క లేకుండా ఉండలేరు. తరతరాలుగా వస్తున్న ఆ ఆచారం విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య పౌరుని నుండి మొదలు ఉన్నత వర్గానికి చెందిన వారు అంతా కూడా సంబరాల్లో మునిగితేలుతారు. నాన్ వెజ్ తినడం అలవాటు ఉన్న ప్రతి ఇంటిలోనూ మసాల ఘుమఘుమలు రావల్సిందే. మద్యం ప్రియులు కూడా ఫుల్ ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే దసరా వేడుకలను పురస్కరించుకుని ఓ వ్యాపారికి వచ్చిన ఐడియా చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యాపారికి ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టేశారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు వైరల్ కావడంతో వ్యాపారి ఎంచుకున్న విధానం చూసి నవ్వుకుంటున్న వారు కొందరైతే తక్కువ డబ్బులకే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కదా మనమూ కొన్ని టికెట్లు కొంటే పోయేదేముంది అనుకుంటున్నారట. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని అంబేడ్కర్ చౌరస్తాలోని మణికంఠ పాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని ప్రకటించిన బంపర్ ఆఫర్ ఎలా ఉందంటే. ఒక్కో టికెట్ రూ. 50 చొప్పున విక్రయిస్తున్నామని, ఒకరికి ఐదు టికెట్లకు మించి ఇచ్చేది లేదని మరీ కండిషన్ కూడా పెట్టేశారా యజమాని. ఈ నెల 24న మెగా లక్కీ డ్రా తీయనున్న సందర్భంగా గెలిచిన వారికి ఇచ్చే బహుమతులకు కూడా దసరా మసాలాను, మద్యాన్ని దట్టించేశారా ఓనర్. ఈ లక్కిడ్రాలో ఫస్ట్ ఫ్రైజ్ గొర్రె పొట్టెలు, సెకండ్ ఫ్రైజ్ మేక పొట్టేలు, థర్డ్ ఫ్రైజ్ 100 పైపర్స్ బాటిల్, ఫోర్త్ ఫ్రైజ్ కోడి పుంజు, ఫిప్త్ ఫ్రైజ్ నాటు కోడి ఇస్తామని చెప్తున్నారు. సాధారణంగా లక్కీ డ్రాలో డబ్బులో, వస్తువులో లేక పోతే టూర్స్ ప్యాకేజీలో ఇచ్చే సాంప్రాదాయాన్ని కొనసాగిస్తుంటారు. కానీ ధర్మపురిలోని మణికంట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మాత్రం దసరా పండగను మనసులో పెట్టుకుని కొత్తతరహా స్కీం స్టార్ట్ చేశారు. డిఫరెంట్ గా ఆలోచించి అమలు చేసిన ఈ స్కీంతో లక్కీ డ్రాతో తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రమోషన్ వర్క్ కూడా జరుపుకుంటున్నారు అంటున్నారు కొందరు.

JAGITIAL NEWSLatest NewsSpecial offer on the occasion of Dussehra: An innovative idea of ​​a businessmantelangana news