నాన్నకు ప్రేమతో… ఐదు దశాబ్దాల తరువాత తొలి సందేశం…

దళపతి గణపతి తనయుడు వాసు ఆడియో…

దిశ దశ, బీర్పూర్:

మావోయిస్టు పార్టీ అగ్రనేత, అంతర్జాతీ విప్లవ సమూహాల కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి తనయుడు శ్రీనివాస్ రావ్ (వాసు) ఆడియో వైరల్ అవుతోంది. దాదాపు ఐదు దశాబ్దాల తరువాత తన తండ్రికి పంపించిన సందేశం చక్కర్లు కొడుతోంది. సుదీర్ఘకాలంగా విప్లవ పంథాలో కొనసాగుతున్న ముప్పళ లక్ష్మణ్ రావు 1970 దశాబ్దం చివర నుండి అజ్ఞాత జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తి నుండి ఉద్యమాల వైపు సాగిన ఆయన అప్పటికే వివాహం చేసుకోవడంతో ఓ కుమారుడు జన్మించాడు. తనయుడి చిరు ప్రాయంలోనే అడవుల వైపు పయనమైన గణపతి కుటుంబం కూడా కొంతకాలానికి హైదరాబాద్ వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన తనయుడు శ్రీనివాస్ రావ్ విదేశాల్లో చదువుకుని ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు. గణపతి భార్య అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు. మావోయిస్టు పార్టీలో నెలకొన్న పరిణామాలతో ముఖ్య నాయకులంతా బయటకు వస్తున్న ఈ నేపథ్యంలో ముప్పాళ కూడా జనారణ్యంలో వస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గణపతి తనయుడు వాసు పిలుపును అందుకుని బయటకు వస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

అర శతాబ్దం…

ఐదు పదులు వయసు దాటిన గణపతి తనయుడు శ్రీనివాస్ రావు అడపా దడపా స్వగ్రామమైన బీర్పూర్, పెద్దపల్లి ప్రాంతానికి వచ్చి వెళ్లేవారని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఏనాడూ కూడా మీడియా ముందుకు రాలేదు. అమెరికాలో చదువుకుంటున్నారన్న విషయం మాత్రమే కొంతమందికి తెలుసు కానీ గణపతి కుటుంబ సభ్యుల వైపు కన్నెత్తి చూసిన వారెవరూ లేరనే చెప్పాలి. అజ్ఞాత జీవితం గడుపుతున్న పలువురు మావోయిస్టు పార్టీ నాయకుల ఇండ్లకు వెల్లి పోలీసులు వారిని బయటకు రావాలన్న పిలుపు ఇప్పించినా గణపతి కుటుంబాన్ని కలిసి దాఖలాలే లేవు. ఆయన స్వగ్రామమైన బీర్పూర్ లో పోలీసులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడమే జాతీయ స్థాయి చర్చకు దారి తీసింది కానీ ఆయన భార్య, కొడుకు వద్దకు మాత్రం పోలీసులు వెల్లిన సందర్భాలయితే లేదు. బాహ్య ప్రపచంతో సంబంధాలు లేకుండా జీవనం సాగిస్తున్న గణపతి కొడుకు శ్రీనివాస రావు తాజాగా విడుదల చేసిన ఆడియో చర్చకు దారి తీసింది. 50 ఏళ్ల వయసు పై బడిన ఆయన తండ్రి గురించి ఏనాడూ మాట్లాడకపోగా ఇప్పుడు మాత్రం నాన్నను బయటకు రావాలని అభ్యర్థించడం గమనార్హం.

హృదయ వేదన…

గణపతి తనయుడు శ్రీనివాస రావు ఆడియో సందేశంలో చేసిన వ్యాఖ్యలు ఆయన హృదయంతరాల్లోని భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తండ్రి ఉండి కూడా ఆయన ప్రేమకు నోచుకుని తనయుడి వేదన వాసు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కన్నతల్లి పడ్డ వేదన, ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న బాధను వివరిస్తూనే నాన్నా మీరు రావాలంటూ అభ్యర్థించారు. మావోయిజం అంటే మీరు… మీరంటే మావోయిజం అన్నట్టుగా, మీ మేధాశక్తితో 12 రాష్ట్రాల్లో విప్లవ సామ్రాజ్యాన్ని స్థాపించి సమాంతర ప్రభుత్వాన్ని కొనసాగించడంలోనూ సఫలం అయ్యారని అయితే ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి విజ్ఞానాన్ని నవ భారత నిర్మాణానికి ఉపయోగపడే విధంగా పంచాలని శ్రీనివాసరావు కోరారు. నా కష్ట సుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని నా మనసు తాపత్రయపడి ఎన్ని వైపులా చూసినా మీరు కనపడరని, నా హృదయ ఘోష మీకు వినపడదన్నారు. మీరు మిత భాషి అని అన్యోన్యమైన జీవనం సాగించారని అమ్మ మాటల్లో తెలిసింది అయితే… మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి మధ్య ఎడబాటుకు కారణమైందని, నన్ను పెంచుకుంటూ తనలోని బాధను మరిచిపోయింది అమ్మ అంటూ శ్రీనివాసరావు తండ్రికి దూరమైన తీరును వివరించారు. మనం కలిసి ఉంటే కొన్ని లక్షల సార్లూ నాన్నా అని పిలిచి ఉండేవాడిని, కానీ నాకు ఊహా తెలిసిన తరువాత మొదటి సారి నాన్నా అని సంబోదిస్తూ సందేశం మొదలు పెడుతున్నానన్నారు. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్ర పడుతుందంటూ వ్యాఖ్యానించారు.

 

GANAPATHImaoist newsMAOIST PARTYmuppala laxman raoViral
Comments (0)
Add Comment