లవకుశ మిల్లులో లారీ పట్టివేత…
దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ కేంద్రంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందా సాగుతున్నట్టుగా ఉంది. పట్టణంలోని బోర్నపల్లి లవకుశ రైస్ మిల్లుల్లో టౌన్ సీఐ కరుణాకర్ ఆధ్వర్వంలో దాడులు చేసి లారీలో తరలిపోతున్న 290 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ లారీని సివిల్ సప్లై అధికారులకు అందజేశామని సీఐ మీడియాకు తెలిపారు.
గన్నీ బ్యాగ్స్…
హుజురాబాద్ పోలీసులు పట్టుకున్న లారీలో తరలిపోతున్న బియ్యం బ్యాగులు కూడా తెలంగాణ సివిల్ సప్లై విభాగానికి చెందినవి ఉండడం గమనార్హం. స్మగ్లర్లు పట్టుబడినప్పుడు డైరక్ట్ గా చిక్కకుండా ఉండేందుకు గన్నీ బ్యాగులను మార్చి పీడీఎస్ బియ్యం తరలిస్తుంటారు. కానీ హుజురాబాద్ లవకుశ రైస్ మిల్లు నుండి తరలిపోతున్న బియ్యం సివిల్ సప్లై అని ముద్రించి ఉండడం గమనార్హం. అయితే రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యానికి మాత్రమే ఈ గన్నీ సంచులను సివిల్ సప్లై విభాగం అధికారులు వినియోగిస్తారు. రైస్ మిల్లులో లోడ్ అయిన బియ్యం అధికారికంగా సరఫరా చేసే గన్నీ బ్యాగ్స్ ఉండడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది.
రీసైక్లింగ్..?
కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ద్వారా దాన్యం తీసుకున్న మిల్లర్లు తెలంగాణ సివిల్ సప్లై విభాగానికి తిరిగి బియ్యం సరఫరా చేయనట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం మిల్లర్లు ధాన్యానికి బదులుగా బియ్యాన్ని అప్పగించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది మిల్లర్లు రూ, కోట్ల విలువ చేసే బియ్యం ప్రభుత్వానికి అప్పగించనట్టుగా తెలుస్తోంది. అయితే వాటిని సర్దుబాటు చేసేందుకు రేషన్ షాపుకు తరలిపోయే బియ్యాన్ని నేరుగా మిల్లుకు తరలించి అక్కడే మిల్లింగ్ చేసినట్టుగా సీన్ క్రియేట్ చేశారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. లవకుశ మిల్లులో మర ఆడించిన బియ్యాన్ని తరలిస్తున్నామని నమ్మించి సీఎమ్మార్ జాబితాలో డిఫాల్ట్ అయిన మిల్లులకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక మహారాష్ట్రకు తరలిస్తున్నారా అన్న విషయం తేల్చాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రకు తరలించేందుకు సరిహద్దు జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా క్రయవిక్రయాలు జరిపే ముఠాలు కూడా రంగంలో ఉన్నాయి. వీరి ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారా లేక స్థానికంగా ఉన్న మిల్లులకు రవాణా చేస్తున్నారా అనే విషయం తేల్చాల్సి ఉంది. మరో వైపున బియ్యం లారీ తనదేనని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఇక్కడ మర ఆడించి సిరిసిల్ల మిల్లుకు రవాణా చేసుకుంటున్నానని స్థానికంగా ప్రచారం చేసుకున్నాడని తెలుస్తోంది. ఆయన చెప్తున్న విషయాన్ని బట్టి ఈ బియ్యం నిజంగానే బయటి వ్యక్తులకు చెందినవి అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలతో పాటు గన్నీ బ్యాగ్స్ కూడా సాధారణమైనవి ఉండాలి… కానీ సివిల్ సప్లై విభాగానికి చెందిన వాటిల్లో ఎలా రవాణా చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
మరో వాదన…
సివిల్ సప్లై విభాగం ద్వారా రేషన్ షాపులకు బియ్యం తరలిస్తున్నామని పట్టుబడ్డ వారిలో కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. మిల్లుల్లో మర ఆడించిన బియ్యం రేషన్ షాపులకు నేరుగా రవాణా చేసే అవకాశం అయితే లేదని సమాచారం. అయితే బియ్యం ప్యాక్ చేసేప్పుడే రేషన్ షాపులకు పంపించేందుకు అనువుగా ఉంటుందని గన్నీ బ్యాగ్స్ సివిల్ సప్లై అధికారులు అనుమతి తీసుకున్న మిల్లర్లకు అందించే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ మేరకు బోర్నపల్లి లవకుశ మిల్లు పర్మిషన్ తీసుకున్నట్టయితే 290 క్వింటాళ్ల బియ్యం నేరుగా గోదాములకు తరలించాల్సి ఉంటుంది తప్ప ప్రైవేటు వ్యక్తులకు కానీ, ఇతర మిల్లులకు కానీ సరఫరా చేసే హక్కు మాత్రం ఉండదు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయా లేదా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కావాలనే మాయమాటలు చెప్పి తప్పించుకున్నట్టయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.