దిశ దశ, దండకారణ్యం:
విప్లవోద్యమ చరిత్రలోనే పెను సంచలనంగా మారింది అభయ్ సహా 61 మంది మావోయిస్టు పార్టీ నక్సల్స్ లొంగుబాటు. పీపుల్స్ వార్ ఆవిర్భావం నుండి అయినా, అంతకు ముందు అయినా పార్టీ లైన్ విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చి వేర్వేరు విప్లవ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న సందర్బాలు ఉన్నాయి. పీపుల్స్ వార్ నుండి విడిపోయి సాయుధ పోరు బాటలో నడిచిన వారూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు పీపుల్స్ వార్ నక్సల్స్ తుపాకితో సహా లొంగిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ లో విలీనం అయిన పీపుల్స్ వార్ అగ్ర నాయకత్వం ఆయుధాలతో పాటు పెద్ద సంఖ్యలో సరెండర్ అయింది మాత్రం అభయ్ నేతృత్వంలో మాత్రమే. పార్టీ నుండి బహిష్కరణలు, ఎన్ కౌంటర్లలో మరణించడం, విపత్కర పరిస్థితుల్లో లొంగుబాట్లు జరిగినప్పటికీ ఏక కాలంలో తుపాకులతో సహా 61 మంది సరెండర్ కావడం మాత్రం భారత విప్లవ చరిత్రలోనే తొలిసారని చెప్పక తప్పదు. మల్లోజ్జుల వేణుగోపాల్ రావు లాంటి సీనియర్ నేత ఆధ్వర్యంలో భారీగా నక్సల్స్ జనజీవనంలోకి రావడం మాత్రం అన్ని వర్గాలనూ ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతా వారే…
అయితే మావోయిస్టు పార్టీలో గత కొంతకాలంగా నెలకొన్న పరిణామాల్లో అభయ్ ప్రకటనలకు అనుకూలంగా కొన్ని డివిజన్లు బాహాటంగానే మద్దతు ఇచ్చాయి. ఇందులో సికాస అశోక్ పేరిట విడుదల అయిన వేర్వేరు లేఖల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ గడ్చిరోలి, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీల ప్రతినిధులు మాత్రం అభయ్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆయన వెంటే తామూ ముందుకు సాగుతామని ప్రకటించారు. కానీ బుధవారం గడ్చిరోలి జిల్లా కేంద్రంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయిన వారిలో ఒక్క గడ్చిరోలి డివిజన్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. నార్త్ బస్తర్ డివిజన్ కమిటీలు లొంగుబాటుకు ముందుకు రాకపోవడం గమనార్హం. అభయ్ రాసిన సుదీర్ఘ లేఖలపై తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ వ్యతిరేకించారు. అయితే అభయ్ లొంగుబాటుకు ముందు ఆయనకు అండగా నిలిచిన నార్త్ బస్తర్ డివిజన్ కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మావోయిస్టు నాయకత్వం మాత్రం వెంట రాకపోవడం గమనార్హం.