స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు తమదైన స్టైల్లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయా గ్రామాల అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థులు ప్రజలకు హామీలు ఇస్తున్న తీరు వైవిద్యంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన చాలా ఎన్నికల్లో కూడా గ్రామ అభివృద్ది కోసం తాము ఫలనా పనులు చేస్తామంటూ ప్రజల సమక్షంలో వాగ్దానాలు ఇచ్చే సాంప్రాదాయానికే అభ్యర్థులు ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో బాండ్ పేపర్లపై రాసి ఇచ్చే సంస్కృతి పెరిగిపోతోంది. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా పని చేసి తీరుతామని లేనట్టియితే హామీ పత్రాన్నే రాజీనామా పత్రంగా భావించాలంటూ సర్పంచ్ అభ్యర్థి ప్రమాణ పత్రాన్ని రాసి ఓటర్లకు పంచుతున్నారు.
కరీంనగర్ లో…
తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు ముందు బెజ్జంకి మండలం కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండేది. అయితే నూతన జిల్లా ఆవిర్భావం తరువాత బెజ్జంకి మండల కేంద్రంతో పాటు కొన్ని గ్రామాలను సిద్దిపేట జిల్లా పరిధిలోకి చేర్చారు. మిగతా గ్రామాలను గన్నేరువరం మండలం పరిధిలో చేర్చి కరీంనగర్ జిల్లాలో ఉంచారు. అయితే దశాబ్దాల కాలంగా కరీంనగర్ జిల్లా కేంద్రంతో బెజ్జంకి మండలం వాసులు పెనవేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి మండలాన్ని చేర్చడం పట్ల స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ మండలాన్ని కరీంనగర్ జిల్లా పరిధిలోకి తిరిగి చేర్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఈ అంశం మరుగునపడిపోయిందని భావించారంతా. కానీ పంచాయితీ ఎన్నికల్లో ఇదే అంశం ప్రధాన ఏజెండాగా మార్చుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు సంగ రవి అనే అభ్యర్థి. కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కూడా రవి బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో విలీనం చేసిన వారికే మద్దతు ఇవ్వాలని కూడా ప్రచారం చేస్తున్న ఆయన తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో బరిలో నిలిచి ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తనను ఆదరిస్తే బెజ్జంకిని కరీంనగర్ లో తిరిగి చేర్చేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానని వివరిస్తూ ఓటర్లకు ప్రమాణ పత్రాలు పంచి పెడుతున్నారు. జాతీయ జనగణన జరిగే లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక శాసన సభ్యులు, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లకు తీర్మాణ పత్రాలు అందజేస్తానన్నారు. బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరుతూ వినతి పత్రాలు కూడా అందిస్తానని హామీ పత్రంలో పేర్కొన్నారు. బెజ్జంకి పోరాట సమితి కూడా ఇదే అంశాన్ని ప్రకటించిన నేపథ్యంలో తాను ఇస్తున్న హామీని గమనించి తనకు ఓటు వేయాలని సంగ రవి అభ్యర్థిస్తున్నారు.