హాజరైన పీఠాధిపతి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
దిశ దశ, కాళేశ్వరం:
శ్లో॥ ప్రణీత వరదా వైణ్య గౌతమీచ సరస్వతి॥ సద్యః పంచ వహం త్యత్ర ప్రయాగా త్కోటి శోధికం ॥
కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మారుమోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగంమంలో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. గురువారం వేకువ జామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ సాంప్రాదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈ సారి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
గణపతి పూజతో…
గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం 5.44 గంటలకు సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. గోదావరి పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆయన సతీమణీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి పుష్కర వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరయ్యారు. విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేసిన తరువాత సరస్వతి నది పుష్కర మహోత్సవ వేడుకలకు అంకురార్పరణ చేశారు.
పీఠాధిపతిచే…
అత్యంత అరుదైన సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుష్కర స్నానలను కూడా నిర్వహించారు. శ్రీ గురుమదానానంద సరస్వతి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి పుష్కర స్నానాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. అనంతరం శ్రీ కాళేశ్వర, మక్తీశ్వర స్వామి, శ్రీ శుభానంద దేవి, సరస్వతి మాత ఆలయాలను సందర్శించుకున్నారు ప్రముఖులు.