దిశ దశ, భూపాలపల్లి:
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటన ఖరారు అయింది. గురువారం ఉదయం జిల్లాలోని మహదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలో నిర్వహించనున్న మహిళా సాధికారిత కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేయడంతో పాటు మహిళలను సమీకరించే పనిలో నిమగ్నం అయ్యారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా అంబట్ పల్లికి చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఉదయం 7.30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ తెలిపారు. హెలిక్యాప్టర్ ద్వారా అంబట్ పల్లికి రానున్న రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.