ప్రమాదమని తెలిసినా పట్టించుకోవడం లేదా..?

దిష్టి బొమ్మలతో నిరసనల తీరు

దిశ, దశ, కరీంనగర్:

అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయా రాజకీయ పార్టీలు చేసే నిరసనలు ప్రమాదపు అంచుల్లో సాగుతున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రాణాల మీదికి తెస్తాయన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. గత అనుభవాలను విస్మరించి మరీ సాహాసం చేస్తున్న తీరు అటు నిరసనకారులకు, ఇటు పోలీసులకు సవాల్ గా మారింది.

దిష్టి బొమ్మల దగ్దం…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా దిష్టిబొమ్మల దగ్దం ఒకటి. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్దం చేస్తున్నప్పుడు బందోబస్తు చేస్తున్న పోలీసులు నిలువరించక తప్పని పరిస్థితి తయారైంది నేడు. గతంలో దిష్టి బొమ్మలను దగ్దం చేసినప్పుడు నిరసనకారుల ఆందోళన ఉధృత రూపం దాల్చకుండా పహారా కాయాల్సిన పోలీసులు నేడు దిష్టి బొమ్మలను తగలబెట్టుకుండా అడ్డుకోవల్సి వస్తోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా డ్యూటీలో ఉండే పోలీసులు దిష్టి బొమ్మలను కాల్చకుండా అడ్డుకోనట్టయితే విఫలం అయినట్టేనన్న విమర్శలు ఎదుర్కొటున్నారు. దీంతో దిష్టి బొమ్మల దగ్దం అనగానే ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉండే పోలీసులు హై అలెర్ట్ గా వ్యవహరించాల్సి వస్తోంది.

గత అనుభవాలు…

దిష్టి బొమ్మలను దగ్దం చేసే క్రమంలో అడ్డుకున్న పోలీసులు, వారి చర్యలను నిలువరించే ఆందోళనకారులకు మంటలు అంటుకున్న సందర్భాలూ లేకపోలేదు. తమ పంథం నెగ్గించుకోవాలని ఆందోళనకారులు ప్రయత్నిస్తే వారి చర్యలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ క్రమంలో అటు పోలీసులు, ఇటు ఆందోళనకారులకు నిప్పంటుకున్న ఘటనలూ ఉన్నాయి. అయితే పోలీసులు అడ్డుకుంటున్నారన్న విషయాన్ని గమనించిన ఆందోళనలు చేపట్టేవారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఒక దిష్టి బొమ్మను తీసుకొచ్చి నిరసన జరిగే చోట వేయగానే పోలీసులు అడ్డుకుని దానిని తీసుకుని వెల్తున్నారు. దీంతో అప్పటికే ప్లాన్ వేసుకున్న ఆందోళనకారులు మరో దిష్టిబొమ్మపై ముందుగానే పెట్రోల్ పోసి నిరసన చేసే చోటకు తరలించి నిప్పంటిస్తున్నారు. పెట్రోల్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణాల మీదికి తెచ్చుకోలేక వెనకంజ వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అయితే ఆందోళన చేస్తున్న వారు కూడా దిష్టి బొమ్మలపై ముందుగానే పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్న క్రమంలో దానిని తరలించిన వారు కూడా ప్రమాదానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం కామారెడ్డి ఘటనకు నిరసనగా కరీంనగర్ బీజేపీ శ్రేణులు చేపట్టిన నిరసనలో రెండు దిష్టి బొమ్మలు తీసుకొచ్చారు. మొదటి దానిని పోలీసులు స్వాధీనం చేసుకోగా మరో బొమ్మను దగ్దం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

AgitationsConcernsprotestsTelangana PoliticsTG NEWS
Comments (0)
Add Comment