అవినీతి అధికారంటూ కరెన్సీ నోట్ల హారం వేసి… జగిత్యాలలో సంచలనం కల్గించిన ఘటన…

చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్

దిశ దశ; జగిత్యాల: అవినీతి అధికారిని వెరైటీగా సత్కరించారక్కడ. మత్సకారుల సొసైటీల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా ఓ జిల్లా అధికారి మెడలోనే కరెన్సీ నోట్ల దండ వేసి ఆయన అవినీతిని బట్ట బయలు చేశారు. ఓ వైపున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి మరో వైపున జిల్లా అధికారి మెడలో నోట్ల హారం వేయడం సంచలనంగా మారింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా కేంద్రం మత్స శాఖ అధికారి దామెదర్ సొసైటీలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంపై నిత్యం అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మత్స సొసైటీల ప్రతినిధులు ఆరోపించారు. సొసైటీల ఏర్పాటు కోసం లంచం ఇవ్వాలని జిల్లా అధికారి దామోదర్ డిమాండ్ చేస్తుండడంతో చేసేదేమీ లేక ఆయన మెడలో కరెన్సీ నోట్ల దండలు వేశామని వారు వివరించారు. మొదట అధికారి కార్యాలయంలో వెల్లిన మత్సకారులు అతన్ని నిలదీసి కార్యాలయం నుండి బయటకు రాగానే ఆయన మెడలో హారం వేయడం సంచలనంగా మారింది. సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే మత్సకారులు వినూత్న రీతిలో నిరసన తెలిపిన తీరు హాట్ టాపిక్ గా మారింది. గతంలో మహారాష్ట్రంలోని ఔరంగా బాద్ లో ఓ సర్పంచ్ ను అక్కడి అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతనే మెడలో కరెన్సీ నోట్ల దండలు వేసుకుని కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. తాజాగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మత్సకారులు డబ్బుల దండ వేయడం సరికొత్త చర్చకు దారి తీసింది.

చర్యలు తీసుకుంటాం: జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా

జగిత్యాల జిల్లా మత్స శాఖ అధికారి దామోదర్ పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపడ్తామని, ఆయన వివరణ తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ప్రకటించారు. అతనిచ్చిన వివరణ తరువాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

JAGITHYALJAGITHYAL NEWSJAGITIAL NEWSLatest NewsProtest by garlanding corrupt official with notes: A sensational incident in Telanganatelangana news