ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీని అధికార యంత్రాంగం వివక్షకు గురి చేస్తున్నట్టుగా ఉంది. ఆయా జిల్లాల అధికారులు సమాచారం ఇవ్వకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో చర్చకు దారి తీస్తోంది. పెద్దపల్లి లోకసభ సభ్యునిగా ఎన్నికైన వంశీ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదన్న ఆగ్రహం వ్యక్త అవుతోంది ఆయన వర్గీయుల్లో తాజాగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తీరుపై ఎంపీ గడ్డం వంశీనే ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ విషయంలోనే జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణమేంటన్న విషయంపై అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు అధికార వర్గాల్లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. గతంలో మంచిర్యాల ఆసుపత్రి ప్రారంభోత్సవం సమయంలో కూడా స్థానిక ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న గడ్డం వంశీకి ప్రాధాన్యత కల్పించలేదని, ఆహ్వాన పత్రికలో కూడా ఆయన పేరు అచ్చు వేయించలేదని దళిత సమాజం అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన తరువాత కూడా ఇంకా ఆయన పట్ల పట్టించుకోని వైఖరే అవలింబిస్తున్నారని స్పష్టం అవుతోంది.

కాకా వర్థంతితో…

తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత జి వెంకటస్వామి (కాకా) వర్థంతిని అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెద్దపల్లి కలెక్టర్ పట్టించుకోలేదని ఎంపీ గడ్డం వంశీ ఆరోపించారు. కలెక్టర్ అగ్ర కుల మైండ్ తో పనిచేస్తున్నాడని కుల పిచ్చితో వ్యవహరిస్తున్నారని ఆయన జిల్లా ప్రజలు బుద్ది చెప్తారని వ్యాఖ్యానించారు. జిల్లాలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ గా, మెజిస్ట్రేట్ హోదాలో ఉండి కూడా లోకసభ సభ్యుడినైన తన విషయంలో ప్రోటోకాల పాటించకపోవడం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రివిలేజ్ మోషన్ ద్వారా లోకసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ గడ్డం వంశీ స్పష్టం చేశారు.


gaddam vamshi mpmp gaddam vamshimp peddapallyPEDDAPALLYtelangana news