Karimnagar: పోలీసుల అధికారుల వద్ద బాడీ వార్న్ కెమెరాలు..!

ఎవిడెన్స్ అంతా రికార్డెడ్…

దిశ దశ, కరీంనగర్:

చేతిలో వాకీ టాకీ, నడుము వద్ద తుపాకీతో మాత్రమే పోలీసు అదికారులు ఉన్నారని భ్రమలో పడకండి… వారి యూనిఫాంపై ఉన్నది హెడ్ ఫోన్స్ కు సంబంధించినవని భావించకండి… అటు ఇటు చూసి వీడియో రికార్డు చేసే పోలీసులూ లేరన్న ధీమాతో ఇష్టారీతిన వ్యవహరించారో ఇక అంతే సంగతులు. ఆందోళన చేసేప్పుడు కానీ, నేరాల పరిశోధనలప్పుడు కానీ దురుసుగా ప్రవర్తించినట్టయితే మరో కేసులో ఇరుక్కోవల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవల్సిందే ఇక. క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణలో నిమగ్నం అయ్యే పోలీసు అధికారులు కామన్ గానే ఉన్నారనుకుని తొందరపడ్డారో కటకటాలు లెక్కించక తప్పదన్న విషయం మరిచిపోకండి.

కమిషనర్ ఆలోచన…

కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసు అదికారులకు కూడా కెమెరాలను అప్పగించారు. ఈ బాడీ వార్న్(body worn camera) కెమరాలను విధిగా తమ యూనిఫారంపై ఫిక్స్ చేసుకుని ఆందోళనలు, నిరసనలకు సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డు చేయాల్సి ఉంటుంది. విధి నిర్వహణంలో దురుసుగా ప్రవర్తించారన్న విషయంలో అయినా, ఆందోళనకారులు వ్యవహరిస్తున్న తీరే అయినా ప్రతి అంశం కూడా వారి యూనిఫారంపై ఉన్న బాడీ వార్న్ కెమెరాల్లో రికార్డు కానుంది. ఉత్కంఠత నెలకొన్న పరిస్థితుల్లో కెమెరాల్లో రికార్డు చేయాలని సీపీ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కెమెరాల్లో రికార్డులను పరిశీలించిన తరువాత శృతి మించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. శాంతియుత వాతావరణానికి భగ్నం కల్గించే విధంగా ఆందోళనకారులు వ్యవహరిస్తే వారిపై చట్టాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది. అలాగే పోలీసు అధికారులపై ఎవరైనా ఫిర్యాదు చేసినట్టయితే బాడీ వార్న్ కెమెరాల్లో రికార్డులను పరిశీలించి తప్పు జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్దారించుకోనున్నారు కమిషనరేట్ అధికారులు. అవసరమైతే ఈ కెమెరాల్లో రికార్డయిని దృశ్యాలను కోర్టులకు కూడా సమర్పించి ప్రధాన సాక్ష్యాధారంగా కూడా చూపించే అవకాశం కూడా ఉండనుంది. ఇప్పటి వరకు నిరసనలు, ఆందోళనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది కెమెరాలతో రికార్డు చేసే వారు. కానీ ఇక నుండి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు కూడా వాటిని రికార్డు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 

crimeflash newskarimnagar newsLatest Newstelangana news