అక్కడ కగార్… ఇక్కడ ఆకర్ష్…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టుల ఏరివేత కోసం ఓ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ సాగుతుంటే… మరో రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ సాగుతున్నట్టుగా ఉంది. ఏక కాలంలో రెండు రాష్ట్రాలకు చెందిన బలగాలను సరిహద్దుల్లో మోహరించడంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ రెండు ఆపరేషన్లు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.

అక్కడ ఎన్ కౌంటర్…

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా డోలి, జెల్ల గ్రామాల మీదుగా వేలది మంది కేంద్ర బలగాలు మూడు నాలుగు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగుట్టల సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన పీఎల్జీఏ కమెండోలు, ఇతర క్యాడర్ ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు భారీ ఎత్తున గాలిస్తున్నాయి. బుధ, గురువారాల్లో వేర్వేరుగా రెండు సార్లు ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా బస్తర్ పోలీసు వర్గాల సమాచారం. ఈ ఘటనలో చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. అయితే ఆఫరేషన్ పూర్తయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పి మీడియాకు విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలిపారు.

కొత్త షెల్టర్ జోనా..?

కర్రెగుట్టల సమీపంలో మావోయిస్టు ఉనికిని గుర్తించిన బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మందు గుండు సామాగ్రిని పెద్ద ఎత్తున గుర్తించినట్టుగా తెలుస్తోంది. మందుపాతరలను అమర్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా బలగాల ఆపరేషన్ లో వెలుగులోకి వచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. కొత్త బ్యాటరీలను కూడా గుర్తించిన బలగాలు సమీప ప్రాంతంలో మందు గుండు సామాగ్రి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్ అనుమానంతో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే జెల్లకు చాలా దూరంగా ఉన్న ఆ ఫారెస్ట్ లో మావోయిస్టులు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకునేందుకు రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారా అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. అక్కడి అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల బాటిల్స్ బాంబులు కూడా గుర్తించినట్టుగా సమాచారం. వీటన్నింటిని నిర్వీర్యం చేసే పనిలో బలగాలు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్…

తెలంగాణ సరిహధ్దుల్లోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ వేరే కారణంగా కొనసాగుతున్నట్టుగా సమాచారం. సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు బలగాలను మోహరించినట్టు తెలిసింది. అయితే మావోయిస్టు పార్టీ పార్టీకి చెందిన శ్రేణులు ఎవరు వచ్చినా వారిని జనజీనవంలోకి రప్పించడానికే తెలంగాణ పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఏక కాలంలో రెండు రాష్ట్రాల్లో ఆపరేషన్ కొనసాగుతుండడంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టుగా ప్రచారం జరిగినప్పటికీ అక్కడి ఆపరేషన్ కు ఇక్కడి ఆపరేషన్ కు ఏ మాత్రం సంబంధం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

chattisghardandkaranyamgodavarimaoist newstelangana police
Comments (0)
Add Comment