ఆధునిక సాంకేతిక విద్య…
ప్రభుత్వ పాఠశాలతో అనుసంధానం
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
సిలబస్ పూర్తి చేసి, వంద శాతం ఫలితాలు సాధించి విద్యార్థులను తీర్చిదిద్దడమే కాదు… వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన బాధ్యత ఉందని గుర్తించారా మాస్టారు… బడికి పెద్ద సారు బాధ్యతలు నిర్వర్తించడంతోనే సరిపెట్టుకుంటే చాలదనుకున్నారా హెడ్ మాస్టర్. తమ బడిలో చదువుతున్న స్టూడెంట్స్ కు ఆధునిక విజ్ఞానంపై కూడా అవగాహన కల్పించాలని సంకల్పించారు. మద్రాస్ IITలో కొత్తగా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం కొత్తగా ప్రారంభించారని తెలుసుకున్నారు. ఈ మేరకు IITమద్రాస్ కు దరఖాస్తు చేసుకోగా భాగస్వామ్యంతో సాంకేతిక విద్య అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
సిరిసిల్ల హై స్కూల్…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ప్రభుత్వ హైస్కూళ్లలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలనే తలంపుతో ఈ కార్యక్రమం సాగనుంది. ఆన్ లైన్ ద్వారా
2 నెలల పాటు సాగనున్న కోర్సులు ఆగస్టు నుండి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్ విధానం ద్వారా కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను IIT మద్రాస్ నుండి పంపిస్తారు. వాటిని చదివిన విద్యార్థులు శని, ఆదివారాల్లో IIT ప్రొఫెసర్ల ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఎగ్జామ్స్ కూడా నిర్వహించనున్నారు. పాఠశాల దశలోనే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యపై పరిపూర్ణమైన అవగాహన కల్పించినట్టయితే భవిష్యత్తులో వారు అత్యంత అద్భుతమైన ఆవిష్కరణలు చేయగలుగుతారని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది నుండే ఈ విద్యా విధానాన్ని ప్రారంభించారు. సెంటర్ ఫర్ ఔట్రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (CODE) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ మద్రాస్ IIT ప్రారంభించింది. IIT మద్రాస్, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలు సంయుక్తంగా డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా పదో తరగతి విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కోర్సులపై అవగాహన కల్పించనున్నారు.
కోర్సుల వివరాలు…
డేటా సైన్స్ అండ్ ఏఐ, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంజినీరింగ్ బయోలాజికల్ సిస్టమ్స్, మ్యాథ్స్ అన్‌ప్లగ్‌డ్ గేమ్స్ అండ్ పజిల్స్, పర్యావరణం, ఫన్ విత్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, హ్యుమానిటీస్ వంటి అంశాలపై విద్యార్థులను సుశిక్షుతులుగా చేయనున్నారు. 8 వారాల పాటు పది కోర్సులను ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు అందించనుంది. ఇందుకు విద్యార్థులు నామమాత్ర రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయోజనం ఏంటంటే..?
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఇది వారి ఉన్నత విద్య తో పాటు భవిష్యత్తులో కెరీర్ ఎంపికలకు సహాయపడుతుంది.
సంతోషంగా ఉంది: హెడ్ మాస్టర్
IIT మద్రాస్, సెంటర్ ఫర్ ఔట్రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (CODE) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ కు మా పాఠశాల భాగస్వామ్యం కావడం. ఆనందంగా ఉంది. విద్యార్థులు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన రంగాలలో ప్రొఫెసర్ ల నుంచి నేరుగా నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుంది.
చకినాల శ్రీనివాస్ , ప్రధానోపాధ్యాయులు, సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల