ఓటమితో ఒకరు… కూటమి విఫలమై మరోకరు…

దిశ దశ, కరీంనగర్:

వారిద్దరూ ఒకే పార్టీ నుండి టికెట్ ఆశించారు. అనూహ్యంగా వారిలో ఒకరికే టికెట్ దక్కింది. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్టీ నుండి టికెట్ ఆశించినా వారిద్దరూ ప్రత్యర్థులు అయ్యారు. ఓడిపోయి ఒకరు గెలిచి మరోకరు లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయారు.

పదో డివిజన్…

కరీంనగర్ పదవ డివిజన్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడి నుండి బీజేపీ టికెట్ ఆశించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సౌగాని కొమురయ్యకు నిరాశ ఎధురయ్యింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ మేయర్, సీనియర్ నాయకుడు డి శంకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇక్కడి నుండి టికెట్ ఆశించి భంగపడ్డ కొమురయ్య స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ ఓటమి చవి చూడగా కొమురయ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు.

మేయర్ అభ్యర్థులుగా…

డి శంకర్ గెలిచినట్టయితే ఆయనకు మేయర్ గా అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావించింది. సామాజిక వర్గాల సమీకరణాలతో పాటు సీనియర్ నేత కూడా కావడంతో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు. అయితే శంకర్ ఓడిపోవడంతో మేయర్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. శంకర్ పై పోటీ చేసి గెలిచిన కొమురయ్య మేయర్ కావాలన్న ఆకాంక్షతో ఉన్నారు. దీంతో ఫలితాలు వెలువడిన తరువాత ఆయనకు మేయర్ గా చేస్తానంటేనే తాను బీజేపీలో చేరుతానని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ససేమిరా అన్నారు. దీంతో కొమురయ్య కూడా కార్పొరేటర్ పదవితో సరిపెట్టుకోవాలని భావించారు. అయితే శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ పావులు కదపడం మొదలు పెట్టి కొమురయ్యను క్యాంపునకు తరలించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులంతా కలిసి కొమురయ్యకు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే వీరికి మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైనంత బలం లేకపోవడంతో ఏఐఎప్బీ అభ్యర్థుల కోసం ప్రయత్నించారు. చివరకు ఆదివారం సాయంత్రం బీజేపీ కన్న బలం ఎక్కువ అయిన తరువాత కూడా కొమురయ్య అభ్యర్థిత్వానికే మొగ్గు చూపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లిఖార్జున రాజేందర్, వైద్యుల అంజన్ కుమార్ ల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా లీక్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో అంతర్మథనం మొదలై తటస్థమైన వారికి మద్దతు ఇచ్చినట్టయితే బావుంటుందనుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వారే మేయర్ కావాలనే ప్రయత్నాలను గమనించిన బీఆర్ఎస్ పార్టీ తర్జనభర్జనలకు గురైంది. ఆ తరువాత బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదని గమనించిన బీఆర్ఎస్ పార్టీ తెల్లవారు జామున శిబిరం నుండి బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో అప్పటి వరకు కూటమి శిబిరంలో ఉన్న ఆశలపై నీళ్లు పోసినట్టయింది. అయితే అన్ని పార్టీలు కలిపి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారనుకున్న క్రమంలో అభిప్రాయ బేధాలు పొడసూపడంతో కొమురయ్య మేయర్ పీఠంపై కూర్చునే అవకాశం లేకుండా పోయింది. 10వ డివిజన్ నుండి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు మేయర్ గా తెరపైకి వచ్చినా అనుకూలించకపోవడ గమనార్హం.

2026 elections2026 Municipal ElectionskarimnagarLatest Newsmuncipal elections
Comments (0)
Add Comment