దిశ దశ, జగిత్యాల:
అంజన్న మాల వేసుకుంటే స్కూలుకు రాకూడదంటూ కండిషన్ పెట్టడంపై దీక్షా పరులు ఆందోళన చేపట్టారు. హనుమాన్ మాల వేసుకున్న ఐదుగురు విద్యార్థులను ఇంటికి పంపించారంటూ విద్యార్థులు, పేరెంట్స్ నిరసన చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని నిఖిల్ భరత్ స్కూల్ లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు అంజన్న మాల వేసుకున్నారు. 21 రోజుల పాటు అర్థ మండల దీక్ష పట్టిన విద్యార్థులు రోజు వారిగానే స్కూలుకు వెళ్లారు. అయితే పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు బడికి రాకూడదని వారిని నిలువరించారు. యాజమాన్యం కూడా ఇదే విధంగా వ్యవహరిచండంతో పాటు ఐదు రోజుల పాటు దీక్ష పట్టిన విద్యార్థులచే 21 రోజుల పాటు లాంగ్ లీవ్ లెటర్ రాయించుకుని ఇండ్లకు పంపించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పట్టణంలోని హనుమాన్ దీక్షా పరులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పాఠశాలలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనంతరం విద్యార్థులను అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది. పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు చేపట్టారు.