దిశ దశ, చెన్నూరు:
చెన్నూరు నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసే విధంగా మంత్రాంగం నెరుపుతున్నారు మంత్రి. స్థానిక ఎన్నికల సమరంలో తన వర్గీయులకే ప్రాధాన్యత లభించే విధంగా ఆయన వేసిన ఎత్తులతో మాజీ ఎమ్మెల్సీకి భంగపాటు తప్పలేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ సతీమణి సునంద బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ కావాలని భావించిన సతీష్ పావులు పారకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ జాగ్రత్త పడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సతీష్ అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో తన భార్యచే పోటీ చేయించాలని నిర్ణయించుకున్న పురాణం సతీష్ ఆమెతో నామినేషన్ కూడా వేయించారు. అయితే మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో పురాణం సతీష్ భార్య సునంద పేరు కాకుండా అల్లూరి సంపత్ పేరును చేర్చడంతో ఆయన వర్గీయులు ఖంగుతిన్నారు. అధిష్టానం నుండి వచ్చిన జాబితాలో తన భార్య సునంద పేరు లేకపోవడంతో నామినేషన్ ఉప సంహరించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అప్రతిహతంగా ఆధిపత్యం చెలాయించిన పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో తన సతీమణి పేరును ప్రకటించుకోలేకపోవడం విచిత్రం. మంత్రి వివేక్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పురాణం సతీష్ భార్య సునందకు అవకాశం రాకుండా చేశారన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది.
వైరమే కారణమా..?
మంత్రి వివేక్, పురాణం సతీష్ ల మధ్య సయోధ్య లేకపోవడం వల్లే ఆయన భార్య అభ్యర్థిత్వానికి సానుకూలత రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరు నాయకుల మధ్య ఎడ మొఖం పెడ మొఖం అన్నట్టుగానే ఉంది. ఎవరి దారిలో వారు పార్టీలో ముందుకు సాగుతున్నారు తప్ప ఇద్దరు కలిసి మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోలేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున మంత్రి వివేక్ ను కార్నర్ చేసేందుకే పురాణం సతీష్ తన భార్యచే నామినేషన్ వేయించి ఉంటారన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా చెన్నూరు పాలిటిక్స్ లో మంత్రి వివేక్ వేస్తున్న ఎత్తులు సొంత పార్టీలోని ప్రత్యర్థులకు మింగుడు పడకుండా షాక్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి.