పట్టు బిగించే యత్నం…
ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మక ఎత్తులు…
దిశ దశ, గోదావరిఖని:
పోయిన చోటే రూపాయి వెతుక్కోవాలన్న నినాదాన్ని అక్షరాల నిజం చేస్తున్నారామె. నల్ల బంగారు గనులపై తన పట్టు సడలకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెలుతున్నారు. ఉద్యమ ప్రస్థానంలో కోల్ బెల్ట్ ఏరియాలో తిరుగులేని ఆధిపత్యం సాధించేందుకు కార్మిక సంఘాన్ని నిర్మించడంలో కీలక భూమిక పోషించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కీలక బాధ్యతల నుండి తప్పించడంతో తనదైన స్టైల్లో ఎత్తులు వేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను పక్కనపెట్టిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ స్థానాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో భర్తీ చేసింది. దీంతో సింగరేణి గనుల్లో తన ఆదిపత్యం లేకుండా చేశారన్న విషయాన్ని గమనించిన ఆమె హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నారు. గతంలో హెచ్ఎంఎస్ తో కలిసి పని చేసినందున ఈ సంఘం అగ్ర నాయకులు కూడా కవిత నాయకత్వాన్ని స్వాగతించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ సంయుక్తంగా పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఉద్యమ కాలంలో టీబీజీకెఎస్ ద్వారా కార్మికులను చైతన్య పరిచి స్వరాష్ట్ర కల సాకారం కోసం సకల జనుల సమ్మెలో పాల్గొనేలా చేయడంలో సఫలం అయ్యారు కవిత. ఆ తరువాత రెండు సార్లు టీబీజీకెఎస్ గుర్తింపు సంఘంగా గెలవడంలోనూ కవిత పాత్ర ఉంది. అయితే ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న కవిత సింగరేణిలో తన పట్టు నిలుపుకునే దిశగా పావులు కదుపుతున్నట్టుగా అర్థం అవుతోంది. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో తనదైన స్టైల్లో పట్టు నిలుపుకున్నట్టయితే ఈ ప్రభావం ఇతర జిల్లాల్లో కూడా పడుతుందని ధృడంగా నమ్ముతున్నారు. సింగరేణిలోని 11 ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్న కవిత హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేస్తూ మరింత పట్టు సాధించాలన్న తపనతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా..?
సింగరేణిలో కార్మిక సంఘంగా ఉన్న హెచ్ఎఎంస్ కు గతంలో నాయిని నర్సింహరెడ్డి జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన హెచ్ఎంఎస్ కు మాత్రం దూరం కాలేదు. ఇదే సంఘంతో కలిసి పనిచేసినట్టయితే తన లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందన్న అంచనాతోనే కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. త్వరలో హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవితను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది. హెచ్ఎంఎస్ మహాసభల్లో కవితకు గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరో వైపున సింగరేణి విస్తరించిన ప్రాంతంలోని ఎదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి కవిత పోటీ చేయాలన్న ప్రతిపాదన కూడా ఆదివారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కూడా కవిత నాయకత్వానికి బలపరుస్తుండడం కూడా ఆమెకు లాభించనుందని అంటున్న వారూ లేకపోలేదు. రానున్న కాలంలో సింగరేణిలో టీబీజీకెఎస్ కంటే బలమైన శక్తిగా ఎదిగేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించినట్టుగా సమాచారం. కోల్ బెల్ట్ ఏరియాలోని ఇతర కార్మిక సంఘాల నాయకులతో కూడా కవితకు వ్యక్తిగత పరిచయాలు ఉండడం, సింగరేణి కార్మిక రంగ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న కవిత కార్యరంగంలోకి దిగినట్టయితే పట్టు బిగించడం ఖాయమని హెచ్ఎంఎస్, తెలంగాణ జాగృతి బాధ్యులు అంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా యాత్ర నిర్వహించాలని కూడా తొలిసారి జరిగిన భేటీలోనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సింగరేణి జాగృతి విభాగం ద్వారా ఆయా కార్యకలాపాలు కొనసాగించనున్నట్టుగా ప్రకటించిన కవిత బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శంఖారావం పూరించేందుకు పకడ్భందీగా ముందుకు సాగుతున్నట్టుగా అర్థం అవుతోంది.