జార్ఖండ్ అడవుల్లో ఎదురు కాల్పులు… 10 మంది మావోయిస్టుల మృతి..?

దిశ దశ, జాతీయం:

జార్ఖండ్ రాష్ట్రంలో గురువారం ఉదయం నుండి మావోయిస్టులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కీకారణ్యాల్లో అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 10 మంది వరకూ మావోయిస్టులు మరణించినట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరుగుతున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. కిరిబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారండ, కుమ్డి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఆపరేషన్స్ ఐజీ మైఖేల్ రాజ్ వెల్లడించినట్టుగా జాతీయ మీడియా వర్గాల కథనం. కోబ్రా 209 బెటాలియన్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. సారండ, కుమ్డి అడవుల్లో బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టుగా సమాచారం. అయితే చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం జార్ఖండ్ అడవుల్లో షెల్టర్ తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినట్టుగా స్పష్టం అవుతోంది. గురువారం నాటి ఘటనలో మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. జార్ఖండ్ అటవీ ప్రాంతంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకులు కూడా షెల్టర్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుండడంతో ఎన్ కౌంటర్ మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

encounterEXCHANGE OF FIREmaoist newsMAOIST PARTYnational news
Comments (0)
Add Comment