నేటి నుండి అమరవీరుల వారోత్సవాలు…
దిశ దశ, దండకారణ్యం:
అమరవీరుల వారోత్సవాలను నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ కార్యాచరణ సిద్దం చేసుకుంది. విప్లవోద్యమంలో ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకునేందుకు బహిరంగంగా అయినా, రహస్యంగా అయినా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. జాగ్రత్తలు తీసుకుని తీసుకుని మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. జులై 28 నుండి ఆగస్టు 3 వరకు నిర్వహించే అమర వీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఉద్యమ ప్రస్థానంలో చనిపోయిన వారికి నివాళులు అర్పించాలని మావోయిస్టు పార్టీ కోరింది.
తీరని నష్టం…
ఐదు దశాబ్దాల ఉద్యమంలో ఈ సారి మావోయిస్టు పార్టీ తీవ్రమైన నష్టాన్ని చవి చూసింది. ఊహించని విధంగా బలగాలు ముప్పేట దాడులు చేయడంతో పార్టీ ఒడి దొడుకులు ఎదుర్కొంటోంది. భారత విప్లవోద్యమ చరిత్రలో చారుమజుందార్ తరువాత పోలీసుల కాల్పుల్లో కేంద్ర కమిటీ కార్యదర్శిని కోల్పోవడం ఈ ఏడాది మాత్రమే చోటు చేసుకుంది. చత్తీస్ గడ్ లోని మాడ్ డివిజన్ గుండెకోట్ అటవీ ప్రాంతంలో మే 21న జరిగిన ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఉరఫ్ బసవరాజ్ (బీఆర్) చనిపోయారు. ఏప్రిల్ 21న ఝార్ఖండ్ రాష్ట్రం బోకారో జిల్లా ముండాటోలీ, సోసా గ్రామాల సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ అలియాస్ ప్రయాగ్ మంఝీతో పాటు 8 మంది చనిపోయారు. జనవరి 20 గరియాబంద్ ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రా రెడ్డి అలియాస్ చలపతి, జూన్ 18న ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గాజర్ల రవి అలియాస్ ఎన్ కౌంటర్ లో మరణించాడు. భారత విప్లవోద్యమంలో వెటరన్ నేత అయిన జగ్జిత్ సింగ్ సోహల్ అలియాస్ శర్మ అక్టోబర్ 20 2024న అనారోగ్యంతో చనిపోయారు. సంవత్సర కాలంలో 357 మంది మావోయిస్టు పార్టీ శ్రేణులు మరణించగా వీరిలో 136 మంది మహిళలు ఉన్నారు. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారు 14 మంది, తెలంగాణాకు చెందిన వారు 23 మంది, దండకారణ్యంలో 281 మంది, ఆంధ్రా, ఒడిషా స్సెషల్ జోన్, ఏపీలో 9 మంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ (MMC)లో 8 మంది, ఒడిషాలో 20 మంది, పశ్చిమ కనుమలు, పంజాబ్ లలో ఒకరి చొప్పున చనిపోయారు. అనారోగ్యం బారిన పడి నలుగురు, సరైన వైద్యం అందక ముగ్గురు, దుర్ఘటనలో ఒకరు, బూటకపు ఎన్ కౌంటర్లలో 80 మంది, చుట్టివేత దాడుల్లో 269 మంది చనిపోయారు. కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు మొత్తం ఐదుగురు సీసీ కమిటీ భాధ్యులు చనిపోగా, రాష్ట్ర స్థాయి నాయకులు 15 మంది చనిపోయారు. వీరిలో 14 మంది ఆపరేషన్ కగార్ కారణంగా చనిపోగా ఒకరు అనారోగ్యంతో మరణించారు. జిల్లా స్థాయి నాయకులు 23 మంది, ఏసీ, పీసీసీ స్థాయిలో ఉన్న వారు 83 మంది, పార్టీ సభ్యులు 138 మంది, PLGAకు చెందిన వారు 17 మంది, ప్రజా నిర్మాణంలో ఉన్న వారు ఆరుగురు, ప్రజలు 34 మంది ఉన్నారు. 357 మందిలో 36 మంది వివరాలు దొరకలేదని మావోయిస్టు పార్టీ తన డాక్యూమెంట్ లో పేర్కొంది.
హై అలెర్ట్…
మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలు నిర్వహించాలని పది రోజుల ముందే పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో చేపట్టవల్సిన కార్యక్రమాలకు సంబందించిన వివరాలను కూడా సూచించింది. అయితే ఈ సారి మావోయిస్టు పార్టీ తీవ్రమైన నిర్భందాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల ఏరివేత కోసం వేలాది సంఖ్యలో బలగాలను మోహరించాయి. షెల్టర్ జోన్ గా ఉపయోగపడే కర్రె గుట్టలను సైతం బలగాలు జల్లెడ పట్టగా, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాను కూడా జల్లెడ పడుతున్నాయి. కీకారణ్యాలకు కూడా బలగాలు చొచ్చుకపోతున్నాయి. చత్తీస్ గడ్, ఒడిషా, ఒడిషా, ఏపీ సరిహద్దు రాష్ట్రాల అడువుల్లోను బలగాలు అణువు అణువు గాలింపు చర్యలు చేపట్టాయి. నేషనల్ పార్క్ ఫారెస్ట్ ఏరియాలోకి బలగాలు చొచ్చుకపోవడమే అత్యం సవాల్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణాలో మాత్రమే మావోయిస్టులకు కొంత మేర సానుకూల వాతావరణం ఉంది తప్ప ఇతర ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితి ఏ మాత్రం లేకుండా పోయింది. తీవ్రమైన అణిచివేత కొనసాగుతున్న ఈ సమయంలో పార్టీ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం సవాల్ గా మారింది. వారోత్సవాల నేపథ్యంలో ఆయా రాష్ట్రల పోలీసులు మావోయిస్టుల ఏరివేత కోసం మరింత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దండకారణ్యంలో రిజర్వూ బలగాలు కూంబింగ్ విస్తృతంగా చేపట్టాయి. అమర వీరుల వారోత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనందర్ స్మారక స్థూపాన్ని బలగాలు కూల్చివేశాయి. ఇప్పటికే నేషనల్ పార్క్ ఫారెస్ట్ ను బలగాలు పెద్ద ఎత్తున చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది.