Maoist News: ఆశన్న భార్య అదృశ్యం… పోలీసులపై అనుమానం…

దిశ దశ, హైదరాబాద్:

మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆశన్న భార్య, పార్టీలో కీలక నాయకురాలి అదృశ్యం సంచలనంగా మారింది. హైదరాబాద్ హఫీజ్ పేటలోని ఓ ఇంటి నుండి ఆమెను తీసుకెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెను తీసుకెళ్లింది పోలీసులా లేక ప్రైవేటు వ్యక్తులా అన్న విషయంపై స్పష్టత రావడం లేదు. మావోయిస్టు పార్టీ అగ్రనేత వాసుదేవరావు అలియాస్ ఆశన్న భార్య శ్రీ విద్య కూడా ఆయనతో పాటు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. ఇటీవల దండకారణ్యంలో జరిగిన ఎన్ కౌంటర్ లలో శ్రీ విద్య ఉనికి తెలియకపోవడంతో ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారా లేక బయటకు వచ్చారా అన్న విషయంపై చర్చ కూడా సాగింది. అయితే అనారోగ్యం బారిన పడిన శ్రీ విద్య చికిత్స కోసం హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్ కు చేరుకుని చికిత్స తీసుకుంటున్న ఆమె ఉనికి బయటకు రావడం సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆశన్య భార్య అయిన శ్రీ విద్య అదృశ్యం కావడంపై శాంతి చర్చల కమిటీ ఛైర్మన్ జస్టిస్ చంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెను పోలీసులు పట్టుకెళ్లినట్టయితే వెంటనే కోర్టులో హాజరు పర్చాలన్నారు. మరో వైపున మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్ జీవన్ లు విడుదల చేసిన మరో ప్రకటనలో శ్రీవిద్యకు ఎలాంటి హాని తలపెట్టవద్దన్నారు. ఆమెను ఎత్తుకెళ్లింది పోలీసులయితే వెంటనే కోర్టులో హాజరు పర్చాలని లేనట్టయితే శ్రీ విద్యను వెతికి పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెపై కేసులు ఉన్నట్టయితే చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరారు. శ్రీ విద్యపై ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు అయి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో వైపున అలిపిరి ఘటన, ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర హత్యతో పాటు పలు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. అయితే శ్రీ విద్యను తీసుకెళ్లింది తామేనని పోలీసులు మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు.

central committeechhattisgarhDANDKARNYAMmaoist newsMAOIST PARTY