దిశ దశ, హైదరాబాద్:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి శనివారం తెలంగాణ డీజీపీ జితేందర్ ముందు లొంగిపోయారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు డీజీపీ. 2011 నవంబర్ 24న ఫశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన మలోజ్జుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ సతీమణి పద్మావతి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన సుజాత తన మేన బావలు పటేల్ సుధాకర్ రెడ్డి, పోతుల సుదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్కే, ఆయన భార్య సుగుణలను స్పూర్తిగా తీసుకున్న పద్మావతి అలియాస్ మైనక్క అలియాస్ మైనాబాయి అలియాస్ సూజాత విప్లవ పంథవైపు సాగారు. 1982 డిసెంబర్ లో ఇంటర్మీడియెట్ చదువుతూ పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆమె రాడికల్ స్టూడెంట్ యూనియన్ (RSU)లో పని చేశారు. గ్రామాలకు తిరిగి వెల్దాం అనే నినాదంతో సుగుణతో కలిసి గ్రామస్థాయిలో పని చేసిన మైనక్క గద్దర్ తో కలిసి జన నాట్య మండలిలో కొంతకాలం పని చేశారు. కోఠీలో పీపుల్స్ వార్ అనుబంధంగా నడుస్తున్న పీస్ బుక్ సెంటర్ లో పని చేశారు. 1984లో మలోజ్జుల కోటేశ్వర్ రావుతో పరిచయం ఏర్పడగా వీరిద్దరు వివాహం చేసుకుని ఓ కూతురుకు జన్మనిచ్చారు. 1987లో దండకారణ్య ప్రాంతంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో కిషన్ జీ, మైనాబాయిలు పార్టీ నిర్మాణం కోసం పని చేశారు. 1988 – 89 ప్రాంతంలో గడ్చిరోలి జిల్లా పెరుమళి, ఏటపల్లి దళల్లో పని చేస్తూ డిప్యూటీ కమాండర్ గా ఎదిగారు. 1996లో ఉత్తర గడ్చిరోలి ప్రాంతంలోని దేవూరి దళ కమాండర్ గా పని చేసి అక్కడి నుండి చత్తీస్ గడ్ లోని దక్షిణ బస్తర్ కు వెళ్లి అక్కడ డివిజనల్ కమిటీ మెంబర్ (DVCM)గా, బాసగూడ ఏరియా కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారు. 2001లో దండకారణ్య స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పని చేస్తూ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే సమయంలో CNM, KAMS, DAKMS అనుబంధ సంఘాలతో పాటు జనతన్ సర్కార్ గ్రామ కమిటీల పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూశారు. 2007లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మైనాబాయి జనతన్ సర్కార్ వ్యవహారాలను చూడడంతో పాటు సబ్ కమిటీ ఆఫ్ మాస్ ఆర్గనైజేషన్స్ (SUCOMO) వ్యవహారానలు కూడా పర్యవేక్షించారు. 2008లో కిషన్ జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆమె మాత్రం దండకారణ్య ప్రాంతంలోనే కొనసాగారు. 2018లో DKSZCలోని జనతన్ సర్కార్ పూర్తిస్థాయి బాధ్యతలను నిర్వర్తించగా, 2022లో మావోయిస్టు పార్టీకి ప్రధాన గెరిల్లా స్థావరం అయిన దక్షిణ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా, 2023లో కేంద్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. కోయ బాషలో ముద్రణ అయిన పేతురి అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా వ్యవహరించారు.
అనారోగ్యమే కారణం…
అనారోగ్యం కారణంగా తాను పార్టీని వీడిపోతున్నానని కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న ద్వారా కేంద్ర కమిటీకి సమాచారం పంపించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న తాను జనజీవనంలో కలవాలని నిర్ణయించుకున్నానని మైనాబాయి ప్రకటించారు. పోరు వద్దు ఊరు ముద్దు అనే నినాదాన్ని పునరుద్ఘాటించాలని నిర్ణయించుకున్నామని డీజీపీ జితేందర్ ప్రకటించారు. లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కారణంగా 2025లో ఇప్పటి వరకు 404 మంది లొంగిపోయారని, వీరిలో నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కమిటీ కార్యదర్శి, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు సాయుధ పోరాటాన్ని వీడారని డీజీపీ వివరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 74 మంది మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని, 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలుగు వారే ఉన్నారన్నారు. విప్లవ పంథాలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారంతా జనజీవనంలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లలో 22 మంది మావోయిస్టు మరణించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది చనిపోయారన్నారు.
చర్చలపై…
గతంలో కూడా శాంతి చర్చలు జరిగాయని అయితే అవి ఎలాంటి ప్రగతి సాధించలేకపోయాయని డీజీపీ జితేందర్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తమను తాము కాపాడుకునేందుకే చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకవస్తున్నారని వ్యాఖ్యానించారు.