రాయ్‌పూర్ లో మరో సంచలనం…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ కేడర్ అజ్ఞాతంలోనే కాకుండా జనజీవనంలో కూడా కార్యకలాపాలకు కొనసాగిస్తున్నట్టుగా వెల్లడైంది. అర్బన్ నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని నిఘా వర్గాలు అప్రమత్తం చేసినప్పటికీ ఓ జంట అధికారుల దృష్టిలో పడకుండా జాగ్రత్త పడుతూ కాలం వెల్లదీసింది. తాజాగా పోలీసులు వీరిని అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చత్తీస్ గడ్ రాజదాని రాయ్ పూర్ లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. బీజాపూర్ జిల్లాకు చెందిన జగ్గు అలియాస్ రమేష్ అతని భార్య కమలలు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నకిలీ అధార్ కార్డు ద్వారా వీరు కొంతకాలంగా రాయ్‌పూర్ లో నివాసం ఉంటున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. రాయ్‌పూర్ లో అద్దె ఇంట్లో నివిసిస్తున్న జగ్గు కొంతమంది ప్రభుత్వ అధికారులు వద్ద డ్రైవర్ గా, గార్డుగా పని చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. చంగోరభట్ట ప్రాంతంలో నివసిస్తున్న ఈ దంపతులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి నుండి మొబైల్ ఫోన్లు, ఇతరాత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
డెన్ కీపరా..?
అయితే జగ్గు దంపతులు అద్దె ఇండ్లలో ఉంటూ అధికారుల వద్ద పని చేస్తూ ఉపాధి పొందడానికి అసలు కారణాలేంటీ..? పార్టీ వారికి ఎందు కోసం పురమాయించింది..? ఇతరాత్ర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా ఇంతకాలం రాయ్ పూర్ లో నివాసం ఉంటున్న జగ్గు దంపతులు డెన్ కీపర్ గా వ్యవహరించారా లేక ముఖ్యమైన సమాచారం చేరవేసే పనికి పూనుకున్నారా అన్న వివరాలను సేకరించే పనిలో రాయ్ పూర్ పోలీసులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఏకంగా రాష్ట్ర రాజధానిలోనే మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న దంపతులు షెల్టర్ తీసుకుని ఉండడం సంచలనంగా మారింది.