వరంగల్ ఉమ్మడి జిల్లాలో సరికొత్త ట్రెండ్…
దిశ దశ, వరంగల్:
స్వాగతం… సుస్వాగతం అంటూ అర్భాటంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సాంప్రాదాయానికి బదులుగా ఫంక్షన్ హాళ్ల ముందు చట్టబద్దమైన హెచ్చరికల బోర్డులు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. ఆనందోత్సవాల నడుమ జరుపుకుంటున్న వేడుకల్లో ఇబ్బందికరంగా మారిన అనుకోని అతిథులకు హెచ్చరికలు చేయక తప్పని పరిస్థితే ఎదురయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేశారంటూ వైరల్ చేస్తున్న ఓ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
హెచ్చరికలు…
ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించే అవకాశం ఉందంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫంక్షన్ హాల్ నిర్వాహాకులు ఏర్పాటు చేసినట్టుగా అందులో పేర్కొనడం గమనార్హం. వేడుకలతో సంబంధం లేని వ్యక్తులు ఎంట్రీ ఇచ్చి భోజనాలు చేస్తుండడంతో సదరు ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ క్రమేపీ తగ్గిపోవడం మొదలైనట్టుగా తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ తో పాటు పలు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో వేడుక ఉందంటే చాలు 200మందికి పైగా లోపలకు వచ్చి భోజనాలు చేసి వెళ్లిపోతున్నారట. పిలవని పేరంటానికి వచ్చిన అతిథులు కారణంగా ఫంక్షన్లు చేసుకుంటున్న వారికే కొన్ని సందర్భాల్లో భోజనాలు దొరకని పరిస్థితులు తయారయ్యాయట. వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటే సంబంధం లేని వారంతా వచ్చి భోజనాలు చేసి వెళ్లడంతో ఇబ్బంది పడుతున్న విషయంలో ఆ నోటా ఈ నోట ఈ ప్రాంతమంతా పాకిపోయింది. దీంతో వేడుకలతో సంబంధం లేని వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గడం మొదలైంది. రవాణా సౌకర్యం కూడా ఉన్నా ఫంక్షన్ హాల్ వైపు కన్నెత్తి చూసే వారు లేకపోవడం ఏంటా అని ఆరా తీసిన వాటి యజమానులకు అసలు విషయం తెలిసింది. వేడుకలకు ఆహ్వానించకున్నా భోజనాలు చేసి పోయేందుకు వందల సంఖ్యలో వస్తున్నారని గుర్తించారు. దీంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చిరించకపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన ఈ రకమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు.