పర్యావరణం… ప్రజా హితం… బూరుగుపల్లి పంచాయితీ తీర్మానం…

దిశ దశ, గంగాధర:

పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించి సంబరాల్లో మునిగి తేలడంతో సరిపెట్టుకోవడం కాదు… గ్రామ ప్రజల కోసం తమవంతుగా బాధ్యతలు నెరవేర్చాలని నిర్ణయించడం ఆధర్శంగా నిలిచింది. ఆర్థిక వనరులు సమృద్దిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే ఎదురీదుతున్న ఓ పథకాన్ని ఓ గ్రామంలో అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వినూత్న నిర్ణయం తీసుకుంది పాలకవర్గం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయితీ పాలకవర్గం తొలి సమావేశంలో చేసిన తీర్మానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సర్పంచ్ దూలం కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలోనే తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే..?

ఒక రూపాయికే…

గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయితీలో దాదాపు 2 వేల జనాభా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్ల బీజేపీ బలపర్చిన అభ్యర్థి దూలం కళ్యాణ్ సర్పంచ్ గా గెలుపోందాడు. గ్రామ పంచాయితీ పరిధిలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారం బాధ్యతలు పంచాయితీనే తీసుకోవాలని నిర్ణయించింది పాలకవర్గం. ఒక రూపాయి చెల్లించి పంచాయితీకి దరఖాస్తు చేసుకున్నట్టయితే మరణించిన వ్యక్తి అంత్యక్రియల బాధ్యతలను పంచాయితీనే మోయనుంది. ‘ఆఖరీ సఫర్’ పేరిట కరీంనగర్ కార్పోరేషన్ లో అమలవుతున్నట్టుగానే బూరుగుపల్లి పంచాయితీలో కార్యరూపంలో పెట్టాలని భావించారు. అంత్యక్రియల ఖర్చు రూ. 8 వేల వరకు అవుతుండగా ఈ ఖర్చును తానే స్వయంగా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నానని సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ వెల్లడించారు.

పర్యావరణం…

ఇకపోతే పర్యావరణం విషయంలో కూడా బూరుగుపల్లి పంచాయితీ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామానికి చెందిన వారి పుట్టిన, పెళ్లి రోజు వేడుకల సందర్భంగా పంచాయితీ తరుపున వారికి ఒక మొక్కను అందించాలని సమావేశం తీర్మాణించింది. ఈ మొక్కను పెంచే బాధ్యత వేడుకలు జరుపుకుంటున్న వారికే అప్పగించాలని నిర్ణయించింది. దీనివల్ల గ్రామంలో పచ్చదనాన్ని పెంపోందించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించినట్టు అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

gramapanchaythikarimnagarpanchayathtelangana newsTG NEWS