హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష… కరీంనగర్ ఫ్యామిలీ కోర్ట్ తీర్పు

దిశ దశ, కరీంనగర్:

సహజీవనం చేస్తూ మహిళను హత్య చేసిన ఘటనలో నిందితుడికి కరీంనగర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మీ కుమారీ యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం… 2022 నవంబర్ 1న కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్గునూరులో అద్దెకు ఉంటున్న రాంకాలి(21)ని శ్యామ్ రాజ్ (29) అనే వ్యక్తి కట్టెతో కొట్టి హత్య చేశాడు. మధ్యప్రదేశ్ లోని బాలాఘట్ జిల్లా కర్ణాపూర్ తాలుకా బక్కర్ గ్రామానికి చెందిన వీరు మేస్త్రీ వద్ద పని చేసేందుకు వలస వచ్చారు. అల్గునూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న క్రమంలో వీరిద్దరి మద్య వచ్చిన గొడవ కాస్తా ప్రాణం తీసేవరకు చేరింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఎల్ఎండి పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలూరి శ్రీరాములు కోర్టులో ప్రవేశ పెట్టి విచారించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మీ కుమారి నిందితునికి యావజ్జీవ కారార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించారు.

judgementkarimnagar newsLatest Newstelangana news
Comments (0)
Add Comment