రాజీనామాకు ముహూర్తం ఖరార్…

జీవన్ రెడ్డి నిర్ణయం…

దిశ దశ, జగిత్యాల:

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారే యోచనను వెనక్కి తీసుకునేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనతో సంప్రదింపులు జరిపినా సానుకూలంగా స్పందించడం లేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

25న రాజీనామా…

ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా సమాచారం. అనచరులతో సమావేశం అయిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ఆలోచనలో మాత్రం లేనని కుండబద్దలు కొట్టారు. దీంతో 40 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయమేనని స్ఫష్టం అవుతోంది. ఏప్రిల్ 5 నుండి 10వ తేదిలోగా బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా సమాచారం. జీవన్ రెడ్డి చేరనున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. అదే వేదిక మీదుగా జీవన్ రెడ్డికి పార్టీలో కీలక పదవిని కెటాయిస్తున్నట్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే జీవన్ రెడ్డి కూడా రాజీనామా చేసేప్పుడు, పార్టీలో చేరే లాంఛనం సందర్భంగా భారీ జన సమీకరణ చేయనున్నట్టుగా తెలుస్తోంది. వేలాది మంది తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీలో చేరే రోజున 50 నుండి 70 వేల మంది జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరునూ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి.

నిర్లక్ష్యం ఫలితం…

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంత దూరం వచ్చిందని స్పష్టం అవుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంలో జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. పిరాయింపులకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం తీరును పదే పదే తప్పు పట్టారు. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ ఎపిసోడ్ విషయంతో కినుక వహించిన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అప్పటి డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు రంగంలోకి దిగారు. ఆ తరువాత కొంత తగ్గినట్టుగా కనిపించిన జీవన్ రెడ్డిని ఏఐసీసీ పెద్దలు ఢిల్లీకి పిలిపించి భేటీ కావడంతో ఆయనకు ప్రాధాన్యత అలాగే ఉంటుందని భావించారంతా. ఆ తరువాత ఆయనకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత లేకుండా పోయిందన్నది వాస్తవం. చివరకు స్థానిక ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి రావడంతో జీవన్ రెడ్డిని వేదనకు గురి చేసింది. మునిసిపల్ ఎన్నికల్లో తన అనచరులను గెలిపించుకున్న తరువాత కూడా తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆయనను మరింత బాధించింది. టికెట్ల కెటాయింపు నుండి ఛైర్ పర్సన్ ఎన్నిక వరకు జీవన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను పట్టించుకోకపోవడం ఆయనను మరింత బాధించింది. దీంతో పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చిన జీవన్ రెడ్డి ఆ దిశగా పావులు కదపడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, మంత్రులు ఫోన్ చేసినా జీవన్ రెడ్డి మాత్రం తన వైఖరిని మార్చుకునే యోచనలో లేనట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఆయనతో చర్చలు జరిపినా తన పట్ల రాష్ట్ర నాయకత్వం చూపిన వివక్ష గురించి వివరించారే తప్ప పార్టీలోనే ఉంటానన్న విషయంపై మాత్రం మాట ఇవ్వనట్టుగా సమాచారం. హైదరాబాద్ రావాలని జీవన్ రెడ్డికి సూచించినా ఆయన మాత్రం నిరాకరించినట్టుగా తెలుస్తోంది.

BRS PARTYCongressJAGITIAL NEWST JEEVAN REDDYTelangana Politics
Comments (0)
Add Comment