తోడు కోసం అన్వేషణ… కొడిమ్యాలలో J1 టైగర్…

డీఎఫ్ఓ రవి ప్రసాద్ వెల్లడి…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నది పెద్దపులేనని అటవీ శాఖ అధికారులు నిర్దారించారు. రెండు ఆవులపై దాడులు చేసింది కూడా ఇదే పెద్దపులిగా గుర్తించారు. మంగళవారం కొడిమ్యాలలో డిఎఫ్ఓ రవి ప్రసాద్ మీడియాకు పెద్దపులికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుండి జన్నారం అడవుల మీదుగా కొడిమ్యాల ప్రాంతంలో J1 టైగర్ సంచరిస్తోందని ప్రకటించారు. రెండు రోజులుగా సంచరిస్తున్న పులి పంజా విసిరి చంపిన ఆవుల్లో ఒక ఆవు వద్దకు మళ్లీ చేరుకుని మాసం తిన్నదని కూడా తెలిపారు. పులి కదలికలు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని డీఎఫ్ఓ తెలిపారు. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల అటవీ ప్రాంతంలో సంచరించినట్టుగా గుర్తించినట్టు వివరించారు.

తోడు జాడ కోసం…

అయితే J1 పెద్దపులి ఆడతోడు జాడ కోసం అన్వేషిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నామని డీఎఫ్ఓ చెప్పారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం ఆరు గంటల తరువాత పంట చేల వద్దకు వెళ్లకూడదని, ఉదయం ఏఢు ఎనిమిది గంటల తరువాతే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని రవి ప్రసాద్ సూచించారు. పులి దాడిలో నష్టపోయిన జంతువులకు పరిహారం చెల్లించేందుకు అటవీ శాఖ సిద్దంగా ఉందని, అయితే పులిని చంపేందుకు మాత్రం ఎవరూ సాహసించవద్దన్నారు. ఒక వేళ పులికి హాని తలపెట్టినట్టయితే వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని డీఎఫ్ఓ హెచ్చరించారు. పంటలను ఆశించే చీడ పీడల కోసం పురుగుల మందుల పిచికారి చేయవద్దని రైతులను కోరారు.

స్పెషల్ టీమ్…

కొడిమ్యాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి బీభత్సం సృష్టించినట్టయితే దానిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రప్పించామని డీఎఫ్ఓ వివరించారు. కొండగట్టు వద్ద బస చేస్తున్న రెస్క్యూ టీమ్ నిమిషాల వ్యవధిలోనే పులిని అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. స్థానికులను భయాందోళనకు గురి చేసినట్టయితే వెంటనే పులిని బంధించి పట్టుకుని మహారాష్ట్ర అడవుల్లోకి తరలిస్తామని చెప్పారు.

మూడు బృందాలు…

మరో వైపున కొడిమ్యాల పరిసర ప్రాంతాల్లో పులి ఆనవాళ్లను గుర్తించేందుకు కూడా ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎఫ్ఓ రవి ప్రసాద్ వివరించారు. సుబ్బారావు, ముషీర్, రత్నమ్మల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ బృందాలు పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని ఐదు నుండి పది కిలోమీటర్ల విస్తీర్ణంలో గాలింపు చర్యలు చేపడతాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పులి అడుగు జాడలు గుర్తించడం, దారి అరుపులు వినడం వంటి చర్యల్లో ఈ మూడు బృందాలు నిమగ్నం అవుతాయన్నారు. J1 పెద్దపులి వల్ల స్థానికులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా సహకరించాలని డీఎఫ్ఓ రవి ప్రసాద్ కోరారు.

FORESTJAGITIAL NEWSTG NEWStigerwild animals
Comments (0)
Add Comment