దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీని సమూలంగా ఏరివేయాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే ఒక్కడు కొరకరాని కొయ్యలా తయారయ్యాడా..? అజ్ఞాతంలో దశాబ్దాలుగా ఉంటున్న ముఖ్య నేతలు సైతం బయటకు వస్తున్న ఈ తరుణంలో ఆయన మాత్రం ససేమిరా అంటుండమే ఇందుకు కారణమా..? ఆయన కారణంగా సీనియర్లు పార్టీని వీడేందుకు ముందుకు రావడం లేదన్న విషయాన్ని గమనించే ఆపరేషన్ అంతా ఆయన చుట్టే సాగుతోందా..? అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.
దండకారణ్యంలో…
బాలల సంఘంలో చేరి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగిన మడావి హిడ్మా బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది. చత్తీస్ గడ్ లోని దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంపై తిరుగులేని పట్టున్న మడావి హిడ్మా అజ్ఞాతాన్ని వీడేందుకు సుముఖత చూపడం లేదని సమాచారం. ఇటీవల జన జీవనంలోకి వచ్చిన కొంతమంది నాయకులు కూడా ఇదే విషయాన్ని అధికారుల ముందు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ తరువాత మారిన పరిణామాల వల్ల పార్టీ తీవ్రమైన ప్రతికూలతను చవి చూస్తోందని, కేంద్ర కమిటీకి చెందిన ముఖ్య నాయకులు కూడా ఎన్ కౌంటర్ లలో చనిపోతున్న తీరు ఆందోళన కల్గిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి పెట్టని కోటగా ఉన్న ప్రాంతాల్లోనూ బలగాలు చొచ్చుకుని వస్తున్నాయి. దీంతో క్రమక్రమంగా పార్టీకి చెందిన అజ్ఞాత నక్సల్స్ నాయకులు సేఫ్టీ జోన్ లోకి తరలివెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ నేషనల్ పార్క్, కర్రెగుట్టలు, గరియాబంద్ వంటి కీకారణ్యాల్లోనూ బలగాలు జల్లెడ పడుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. ఆయుధ విరమణ ద్వారా బాహ్య ప్రపంచంలోకి వెళ్లాలన్న ప్రతిపాదనను హిడ్మా వ్యతిరేకిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఆయన కారణంగా ముఖ్య నాయకులు చాలా మంది పార్టీని వీడేందుకు ముందుకు రావడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిడ్మా లక్ష్యంగా ఓ బలగాలు ఏరివేతలో నిమగ్నం అవుతుంటే మరో వైపున ఆయనను జనజీవనంలోకి రప్పించేదుకు ఏకంగా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ రంగంలోకి దిగారు. మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న సుక్మా జిల్లా పువ్వర్తి హిడ్మా స్వస్థలం కాగా ఆ గ్రామానికి వెల్లిన డిప్యూటీ సీఎం ఆదివాసీలతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా హిడ్మా జనజీవనంలోకి రప్పించేందుకు చొరవ తీసుకోవాలని ఆయన తల్లిని కోరారు. మరో నక్సల్ నేత దేవా కుటుంబ సభ్యులను కూడా కలిసిన డిప్యూటీ సీఎం బాహ్య ప్రపచంలోకి రావాలని పిలుపునిచ్చారు.
రక్షణ వలయంలో…
అయితే ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో హిడ్మా స్వీయ రక్షణ చర్యలు అత్యంత పకడ్భందీగా తీసుకుంటున్నట్టుగా నిఘా వర్గాల సమాచారం. దాదాపు 200 మంది సైన్యాన్ని ఏర్పర్చుకున్ని హిడ్మా పార్టీ కార్యకలాపాలను కొనసాగించే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. తనకు అత్యంత నమ్మకమైన వారిని మాత్రమే తనతో పాటు ఉండేలా చొరవ తీసుకున్న హిడ్మా తన రక్షణ వలయాన్ని ఛేధించి బలగాలు తన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా సమాచారం. అయితే ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు..? ఎక్కడ షెల్టర్ తీసుకుంటారు అన్న విషయాలపై అత్యంత సీక్రసీ మెయింటెన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజ్జుల వేణుగోపాల్ రావు, డికెఎస్ జడ్ సి కార్యదర్శి తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్నతో పాటు దాదాపు 300 మందికి పైగా గడ్చిరోలి, నార్త్ బస్తర్, గరియాబంద్ ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు ఆయుధాలతో సహా పార్టీని వీడారు. మరో వైపున తెలంగాణలో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, సికాస ఇంఛార్జి బండి ప్రకాష్ లు నిరాయుధులుగా జనజీవనంలోకి వచ్చారు. ఆ తరువాత పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఎవరూ కూడా బయటకు రాకపోవడం, ఇందుకు హిడ్మానే ముఖ్య కారణమై ఉండొచన్న అంచనాతో పోలీసులు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హిడ్మా టార్గెట్ గా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. అయితే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతల ఇంటిబాట పట్టినట్టయితే సానుకూల ఫలితాలు వస్తాయన్న యోచనలో చత్తీస్ గడ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా చత్తీస్ గడ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ శర్మ పువ్వర్తిని సందర్శించి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ సీనియర్లకు అండగా ఉంటున్న హిడ్మా బయటకు వచ్చినట్టయితే మావోయిస్టు పార్టీ కీలక నాయకత్వం కూడా వనాలను వీడే అవకాశం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.