PLGA బెటాలియిన్ల ప్రస్తానం ముగిసినట్టేనా..?

తెలంగాణ సీఎం ముందు లొంగుబాటు…

దిశ దశ, హైదరాబాద్:

మావోయిస్టు పార్టీ రక్షణ విభాగం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) దాదాపుగా తుడిచి పెట్టుకపోయింది. కేంద్ర కమిటీతో పాటు రీజనల్ కమిటీ ప్రతినిధులకు రక్షణ వలయంగా ఉండే PLGAకు చెందిన పలువురు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దీంతో PLGA వ్యవస్థ సమూలంగా అంతరించి పోయినట్టేనని పోలీసులు చెప్తున్నారు. పీపుల్స్ వార్ పార్టీ మొదట పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (PGA)ను ఏర్పాటు చేయగా 2000 సంవత్సరం నుండి దానిని PLGAగా మార్చారు. 1999 డిసెంబర్ 2న పీపుల్స్ వార్ అగ్రనేతలు నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిలు కొయ్యూరు వద్ద ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఆ తరువాత సంవత్సరం నుండి PLGA వారోత్సవాలను నిర్వహించే ఆనవాయితీ ప్రారంభం అయింది.

13 బెటాలియన్లు…

PLGA నేతృత్వంలో మొత్త 13 బెటాలియన్లు ఉండేవి. క్రమక్రమంగా బెటాలియన్ల ఉనికి లేకుండా పోతూ వచ్చింది. గత సంవత్సరం PLGA సభ్యులు చాలా మంది జనజీనవంలోకి వచ్చారు. అగ్రనేతలు జనజీనవంలోకి వచ్చినప్పుడు వారితో పాటు కొన్ని బెటాలియన్లు బాహ్య ప్రపచంలోకి వచ్చాయి. దీంతో PLGA బెటాలియన్లు రెండింటికే పరిమితం అయింది. బెటాలియన్ 1 ఇంఛార్జిగా మాద్వి హిడ్మా వ్యవహరించగా ఆయన గత సంవత్సరం ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. 2 బెటాలియన్ ఇంఛార్జిగా ఉన్న బార్సె దేవా ఇటీవల తెలంగాణ పోలీసుల ముందు జనజీనవంలో కలిశారు. ఆ తరువాత PLGA బెటాలియన్ సభ్యులకు దిశా నిర్దేశం చేసే వారు లేకుండా పోయారు. గత కొంతకాలంగా తెలంగాణ పోలీసులు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్న తీరుతో చత్తీస్ గడ్ కు చెందిన PLGA క్యాడర్ కూడా ఇక్కడే బాహ్య ప్రపచంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపింది. ఒక్క బార్సె దేవా ద్వారానే ఏటా 200 నుండి 300 మంది వరకు సాయధ దళాల్లో శిక్షణ పొంది సుశిక్షుతులయ్యేవారు. వీరంతా కూడా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రీజనల్ కమిటీలతో పాటు ఇతర ప్రముఖులకు రక్షణ వలయంగా ఉండేవారు.

భారీ లొంగుబాటు…

మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్షేత్రాలలో పని చేస్తున్న PLGA బాధ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం లొంగిపోయారు. వీరిలో PLGA బెటాలియన్ తో పాటు ప్రముఖుల సెక్యూరిటీలో భాగస్వాములు అయిన వారు కూడా ఉన్నారని పోలీసు అధికారులు ప్రకటించారు. మొత్తం 130 మంది లొంగిపోగా ఒక్క PLGA వన్ బెటాలియన్ కు చెందిన వారే 42 మంది ఉన్నారు. దీంతో PLGA ఉనికి లేకుండా పోయిందని తెలంగాణ పోలీసు అధికారులు వెల్లడించారు. వీరి నుండి మొత్తం 124 ఆయుధాలు, 5205 తూటాలు స్వాధీనం చేసుకున్నామని కూడా ప్రకటించారు.

chattisghardandkaranyammaoist newsMAOIST PARTYPLGA
Comments (0)
Add Comment