నరుల కంటే వానరాల సంఖ్యే ఎక్కువ…

మంకీస్ పల్లిగా మారిన మన్నెంపల్లి…

దిశ దశ, తిమ్మాపూర్:

తెలంగాణలోని ఓ గ్రామంలో నివసిస్తున్న జనాభా కంటే రెట్టింపు సంఖ్యలో కోతులు రాజ్యమేలుతున్నాయి. చిన్న ఊరే అయినా పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది ఆ పల్లె. ఆ గ్రామంలోని ఇంటికొక్కరు కోతుల దాడుల్లో గాయపడిన వారు ఉన్నారంటే వారి పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కోతుల బెడద నుండి తప్పించుకునేందుకు విరుగుడు కనిపెట్టారు గ్రామస్థులు.

మన్నెంపల్లి…

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ జనాభా దాదాపు 3,500 కాగా ఈ గ్రామంలో వేల సంఖ్యలో కోతులు సంచరిస్తున్నాయి. దీంతో ఈ గ్రామస్థులు భయం గుప్పిట జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోతుల దాడుల్లో ఇంటికి ఒకరిద్దరు గాయపడిన వారు ఉన్నారంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వృద్దులు, పిల్లలు బయటకు రావాలంటే భయంతో కంపించిపోతున్న పరిస్థితి తయారైంది. నిత్యం పంటలను నాశనం చేయడంతో పాటు కిరాణ దుకాణాలపై పడి దాడులు చేస్తున్నాయి కోతులు. కోతుల కారణంగా గ్రామంలో మొక్క జొన్న, పల్లి, పెసర, కంది, కూరగాయలను సాగు చేయడమే మానుకున్నారంటే అక్కడ ఏస్థాయిలో కోతులు విధ్వంసం సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

విరుగుడు ఇలా…

కోతుల బాధ నుండి తప్పించుకునేందుకు గ్రామస్థులు వినూత్న ఆలోచేన చేశారు. కోతులను భయపెట్టేందుకు ఏం చేయాలా అని సుదీర్ఘంగా ఆలోచించిన మన్నెంపల్లి వాసులు పులి బొమ్మలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. గ్రామస్థులు ఇంటి నుండి బయటకు వెలుతున్న సమయంలో పులి బొమ్మలను పట్టుకుని తిరుగుతున్నారు. పులి బొమ్మలను చూసిన కోతులు భయపడి అక్కడి నుండి వెల్లిపోతున్నాయి. ఆంజనేయుని స్వరూపమని భావించిన గ్రామస్థులు వాటిని చంపడం సరికాదని భావించిన గ్రామస్థులు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. పులి బొమ్మలను చూపిస్తూ కోతుల బారి నుండి తప్పించుకోవడం మొదలు పెట్టారు గ్రామస్థులు. చేలకు వెళ్లిన, ఆరు బయటకు వచ్చిన వెంట పులి బొమ్మను తీసుకెళ్తుండడంతో కోతుల బారిన పడకుండా సేఫ్ గా తిరగగలుగుతున్నారు.

karimnagarLatest Newsmonkeystelanganan newstiger