దిశ దశ, మానకొండూరు:
గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల జోరు కొనసాగుతూనే ఉంది. ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండానే నడుస్తున్న ఈ ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటు చేసిన మెడికల్ షాపు మాత్రం సర్టిఫికెట్ ద్వారా లైసెన్స్ పొందడం గమనార్హం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజస్ట్రార్, ఛైర్మన్ లకు నకిలీ వైద్యులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో నిర్వహిస్తున్న నకిలీ వైద్యశాలపై టీజీఎంసీ మెంబర్ యగ్గన్న శ్రీనివాస్ పోరండ్ల గ్రామంలో అర్హత లేకుండానే రవీందర్ రెడ్డి అనే వ్యక్తం వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించారు. నకిలీ వైద్యుడు బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా రోగులకు యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్ లు ఇస్తున్నట్టుగా యగ్గన్న శ్రీనివాస్ ఆరాలో తేలింది. అంతేకాకుండా ఆపరేషన్ల కోసం వినియోగించే సర్జికల్ టూల్స్ కూడా లభ్యం అయ్యాయి.
మెడికల్ స్టోర్…
అయితే నకిలీ వైద్యడు రవీందర్ రెడ్డి నిర్వహిస్తున్న ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటు చేసిన మెడికల్ షాపు మాత్రం ఫార్మసీ సర్టిఫికెట్ తో కొనసాగిస్తుండడం గమనార్హం. లైసెన్స్ తీసుకునేందుకు ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ద్వారా అనుమతి తీసుకుని ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నట్టుగా టీజీఎంసీ మెంబర్ యగ్గన్న శ్రీనివాస్ గమనించారు. ఫార్మసి కోర్సు పూర్తి చేసిన సదరు వ్యక్తి లేకుండానే మెడిసిన్స్ అమ్మకాలు చేస్తున్నారని గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో TGMC బృందాలు దాడులు చేసినప్పుడు ఫార్మసిస్ట్ లేకుండా ఫార్మసి సర్టిఫికెట్లతో మెడికల్ షాపులు కొనసాగిస్తున్నట్టుగా వెలుగులోకి వస్తుండడం గమనార్హం. అర్హులైన వారి సర్టిఫికెట్లతో మెడికల్ షాపులు నిర్వహిస్తూ మందులు అమ్మడం చట్టరిత్యా నేరమని టీజీఎంసీ మెంబర్ వెల్లడించారు. ప్రొఫెషన్ తో సంబంధం లేని వ్యక్తులు అమ్మే మందులు వినియోగించడం రోగుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. ఇలాంటి మెడికల్ షాపులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి ఫిర్యాదు చేస్తామని యగ్గన్న శ్రీనివాస్ వెల్లడించారు.