దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని: సిహెచ్ విద్యాసాగర్ రావు

దిశ దశ, కరీంనగర్:

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని ఎప్పుడో భావించారని, దానిని సాధించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు.శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈ విషయాన్ని అంబేద్కర్ ఏనాడో రాశాడని తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అదేనన్నారు. రెండో రాజధానికి కావల్సిన అర్హతలన్ని హైదరాబాద్ నగరానికి ఉన్నాయని, మౌళిక వసతులు కూడా ఉన్నాయన్నారు. అంబేడ్కర్ మనవటడు కూడా ఇటీవల ఇదే విషయాన్ని వెల్లడించారని సాగర్ జీ గుర్తు చేశారు. బంగారు తెలంగాణ ఆకాంక్ష కూడా రెండో రాజధాని ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, తెలంగాణ రాజకీయాలపై అధ్యక్షుడు, పార్టీ నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని, క్రియాశీలక నిర్ణయాలు పార్టీ వెల్లడిస్తుందన్నారు. పార్టీకి ఏదో జరుగుతుందని అనుకోవడం సరికాదని, దేశంలో బీజేపీ కి మంచి స్కోప్ ఉందని విద్యాసాగర్ రావు అన్నారు. ఫిక్స్ డిపాజిట్లలాగా దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పేరిట ఉన్నాయని, మిగతా పార్టీల ఓట్లు జాయింట్ అకౌంట్లలో ఉంటాయని వాటిని విడిపించుకోవల్సిన సత్తా తమ పార్టీ నాయకులపై ఉందన్నారు. మోడీ గొప్పదనాన్ని పునాదిగా తీసుకుని బీజేపీ ముందుకు సాగాలని సూచించారు. ఆయన పాలనలో భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అన్ని దేశాలు ప్రధాని మోడీ సలహాలు తీసుకుంటున్నాయని వివరించారు. రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా లేనని, తాను సాధారణ బీజేపీ సభ్యుడిని మాత్రమేనని సాగర్ జీ వ్యాఖ్యానించారు.

నా వ్యాఖ్యలన్ని ఆచరణలోకి…

ఎంపీగా ఎన్నికై 25 సంవత్సరాలు పూర్తయిందన్న విద్యాసాగర్ రావు తాను గతంలో ఇచ్చిన పిలుపులన్ని కూడా ఆచరణలోకి వచ్చాయన్నారు. గ్రామ గ్రామనికి గోదావరి జలాలు అన్న నినాదం, కరీంనగర్ టు కశ్మీర్ రైల్వే లైన్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేపట్టాలన్న పిలుపు నిజమైందన్నారు. పాతికేళ్ల క్రితం తాను ఎంపీగా చేసిన ప్రతిపాదనలు అన్ని ఆచరణలోకి రావడంతో తనకెంతో సంతోషంగా ఉందని విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ పోరాటాలు బీజేపీ ఎంతో మేలు చేస్తాయన్నారు. కరీంనగర్ కల్లోల జిల్లా కాదు కళకళలాడే జిల్లా అని కూడా తాను ఆరోజే చెప్పానని, జిల్లా అభ్యున్నతి వెనక అన్ని పార్టీల కృషి ఉందని సాగర్ జీ అన్నారు. కరీంనగర్ తనకు జన్మభూమితో పాటు కర్మభూమి కూడా అని ఆయన అన్నారు.

bandi sanjaybjp newsBJP TELANGANAch vidyasagar raochennamanenikarimnagar newsLatest Newstelangana news