Telangana Bjp: ఈటెల వర్గాన్ని పక్కన పెడుతున్నారు…

అసెంబ్లీ కన్వీనర్ రాజీనామా…

దిశ దశ, హుజురాబాద్:

భారతీయ జనతా పార్టీలో వర్గాలు లేవు… అంతా మోడీ గ్రూపేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించిన కొద్ది సేపట్లోనే హుజురాబాద్ నియోజకవర్గంలో రాజీనామా చేయడం సంచలనంగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న మాడ గౌతం రెడ్డి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ వర్గాన్ని ప్రణాళిక ప్రకారంగా పక్కనపెడుతున్న తీరుతో కలత చెంది అసెంబ్లీ కన్వీనర్ బాధ్యతలకు, బీజీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2022 నుండి బీజేపీ క్రియాశీలక కార్యకర్తగా, అసెంబ్లీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ అప్పగించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించానన్నారు. అయితే ప్రస్తుతం పార్టీలో అంతర్గత పోరు, ఆదిపత్య పోరు సాగుతోందని, ఈటల వర్గాన్ని అవమనాలకు గురి చేస్తున్నారని మాడ గౌతం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ సమీకరణ..?

హుజురాబాద్ బీజేపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై కలత చెందిన ఎంపీ ఈటల రాజేందర్ వర్గం శామీర్ పేటకు వెళ్లి ఆయనతో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మండలాల వారిగా వెల్లి ఈటలను కలుస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గం అంతా కలిసి శామీర్ పేటకు వెల్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వందలాది వాహనాల్లో ఈటల రాజేందర్ ఇంటికి చేరుకునే విధంగా ఆయన హితులు, సన్నిహితులు ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలుస్తోంది.

bandi sanjayeatela rajendareetela rajenderLatest Newstelangana bjp