ఇండ్లు లేకున్నా… నంబర్లు… ఆ తరువాత రిజిస్ట్రేషన్లు..?

రేకుర్తిలో ఇంటి అనుమతుల తీరు…

తవ్వినా కొద్ది పెంకాసులే…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ బల్దియా కమిషనర్ ప్రపుల్ దేశాయ్ శివారుల ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై చెక్ పెట్టే పనిలో పడ్డారు. ఇంటి నిర్మాణాల అనుమతుల పేరిట లోతుపాతులు అన్వేషించే పనిలో నిమగ్నం అయ్యారు. అక్రమార్కులు ఆసరాగా చేసుకున్న సాకుల మాటున సాగిన దందా గుట్టు తేల్చేందుకు సమాయత్తం అయ్యారు. తవ్వినా కొద్ది పెంకాసులే అన్నట్టుగా మారింది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన ప్రాంతాల పరిస్థితి.

రేకుర్తిలోనే…

రేకుర్తి భూముల్లో వెలుగులోకి వచ్చిన ఇంటి నంబర్ల దందా అధికారులను నివ్వెరపరుస్తోంది. ఇండ్లు లేకున్నా ఇంటి ఫోటోలను క్రియేట్ చేసి మరీ మునిసిపల్ అనుమతులు తీసుకున్నారు. ఈ ఇంటి నంబర్ల ఆధారంగా భూముల క్రయ విక్రయాలకు తెరలేపినట్టుగా అనుమానాలు వస్తున్నాయి. ఆన్ లైన్ సేవల ద్వారా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ఇందుకు సెల్ఫ్ అసెస్ మెంట్ అయితే సరిపోతుందని ప్రభుత్వం చెప్పింది. దీనిని ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు ఇష్టారీతిన ఇంటి నిర్మాణాలకు పర్మిషన్లు తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఇంటి నంబర్ల ఆధారంగా భూములను మరోకరి పేరిట మార్పిడీ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆశ్రయించినట్టుగా సమాచారం. హౌజ్ నంబర్, ఫోటో కూడా చూపిస్తుండడంతో రిజిస్ట్రేషన్ అధికారులు చకాచకా యాజమానుల పేర్లు మార్చేశారు. అయితే రిజిస్ట్రేషన్ విభాగంలో లింకు డాక్యూమెంట్లు క్రియేట్ కావడానికి అత్యంత కీలకమైన ఆధారం ఇంటి నంబర్లేనని స్పష్టం అవుతోంది. ఈ ఇంటి అనుమతుల కోసం బల్దియాను మిస్ గైడ్ చేసేందుకు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రంగంలోకి దిగగా… బల్దియాలో పని చేస్తున్న కొంతమంది తమవంతు సాయం అందించారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఒక్క రేకుర్తిలోనే మొదట 200కు పైగా నిర్మాణాలు లేని ఇండ్లకు నంబర్లు కెటాయించినట్టుగా తేలగా, తాజాగా మునిసిపల్ అధికారులు చేపట్టిన విచారణలో ఆ సంఖ్య 800 మార్కు దాటినట్టుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల మొక్కుబడిగా రేకుల షెడ్లు వేసి కూడా ఇంటి నంబర్లు తీసుకున్నట్టుగా మునిసిపల్ అధికారులు విచారించినప్పుడు వెలుగులోకి వచ్చింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే మరిన్ని బోగస్ ఇండ్ల గుట్టు రట్టయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

నోటీసులు…

మరో వైపున నిర్మాణం లేని ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చిన విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇంటి యజమానులకు నోటీసులను పోస్టల్ ద్వారా పంపించేందుకు రంగం సిద్దం చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లేని ఇండ్లకు అనుమతులు తీసుకున్న చోటికే పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా నోటీసులు పంపించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బల్దియాలో ఉన్న రికార్డుల ప్రకారం ఓపెన్ ప్లాట్లుగా ఉన్న నకిలీ ఇంటి నంబర్ల వద్దకు నోటీసులు పంపినా అవి తిరిగి బల్దియా కార్యాలయానికి చేరడమే తప్ప ఓనర్లకు మాత్రం అందే అవకాశం లేదు. ఓపెన్ ప్లాట్లలో యజమానులు నివసించే అవకాశం లేనందున నోటీసులు బ్యాక్ టు పెవిలియన్ కావడం తప్ప మరో దారి అయితే లేదన్నది నిజం. ఇంటి నంబర్లు తీసుకున్నప్పటికీ అక్కడ ఇండ్లు లేకపోవడంతో నోటీసులు ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి పోస్టల్ విభాగానికి ఎదురవుతుంది. ఓపెన్ ప్లాట్లలో అనుమతులు ఇండ్లు నిర్మాణం చేశామని ప్రభుత్వ శాఖలను మిస్ గైడ్ చేశారని, సెల్ఫ్ అసెస్ మెంట్ కారణంగా చాలా మంది బల్దియా నిబంధనలను దుర్వినియోగం చేసుకున్నారని క్రిమినల్ కేసులు నమోదు చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను కూడా పరిశీలించినట్టయితే రేకుర్తి భూముల్లో అక్రమ భూ దందాకు ఏ స్థాయిలో తెరలేపారలో అర్థం అవుతుందని అంటున్న వారూ లేకపోలేదు. ఇండ్లు నిర్మించకున్నా ఉన్నట్టుగా చూపించి పర్మిషన్లు తీసుకోవడం ప్రభుత్వ విభాగాన్ని ఛీటింగ్ చేసినట్టే అవుతుందని, అలాగే లేని ఇండ్లకు తీసుకున్న అనుమతుల ఆధారంగా వేరే వ్యక్తులకు భూములు విక్రయించిన విషయంపై దృష్టి సారిస్తే వారి కుట్ర కోణం కూడా బట్టబయలు అవుతుందని అంటున్న వారూ లేకపోలేదు.

ఆ భూముల్లోనూ…

వివాదాల భూముల్లో పెద్ద మొత్తంలో ఇండ్ల నిర్మాణం జరుగుతుండడంపై కూడా బల్దియా యంత్రాంగం తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగాలతో సంబంధం లేకుండానే మునిసిపల్ అనుమతులు ఇవ్వడం, రేకుర్తి పంచాయితీ సమయంలో అనుమతులు తీసుకున్నట్టుగా చెప్పి పర్మిషన్ ఎక్స్ టెన్షన్ తీసుకున్న విషయంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న భూముల్లోనూ ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కూడా కోర్టు ఆదేశాల ధిక్కారం కిందకు వస్తుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.  రేకుర్తితో పాటు విలీన గ్రామాల్లో ఈ దందా పెద్ద ఎత్తున సాగినట్టుగా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, మునిసిపల్, రిజిస్ట్రేషన్ విభాగాల సమన్వయంతో ఇంటి అనుమతుల మాటున సాగిన భారీ స్కాంను వెలుగులోకి తీసుకరావల్సిన అవసరం ఉంది.

Karimnagar Corporationkarimnagar newsrekurthy landstelangana newsTG NEWS