హై కోర్ట్ అడ్వకేట్స్ మర్డర్ కేస్… సీబీఐకి బదిలీ చేసిన సుప్రీం కోర్ట్…

దిశ దశ, మంథని:

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన హై కోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.. 2021 ఫిబ్రవరి 17న మంథని పెద్దపల్లి రహదారిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వామన్ రావు, నాగమణీలు హత్యకు గురైన సంగతి తెలిసిందే. మంథని కోర్టులో కేసు విచారణ కోసం వెల్లివస్తుండగా వీరిద్దరూ హత్యకు గురి కాగా ఈ కేసులో పలువురిని అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అడ్వకేట్ల మర్డర్ కేసు విషయంలో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో అప్పటి ప్రభుత్వం ఐజీ నాగిరెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. రామగుండం కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో కుట్ర కోణం దాగి ఉందని వామన్ రావు తండ్రి కిషన్ రావు పలు మార్లు ఆరోపించారు. అంతేకాకుండా వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని, సీబీఐకి కేసు విచారణ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టును కూడా అభ్యర్థిచారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు తెలంగాణ ప్రభుత్వం నుండి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వామన్ రావు, నాగమణిల హత్య కేసును సీబీఐకి అప్పగించడానికి తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించింది. మంగళవారం విచారించిన సుప్రీం కోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది.

మళ్లీ మొదటి నుండి…

వామన్ రావు, పీవీ నాగమణీల హత్య కేసుపై సీబీఐ అధికారుల బృందం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 17న జరిగిన పరిణామాలు, కేసులో అరెస్ట్ అయిన వారి ద్వారా దర్యాప్తు అధికారులు సేకరించిన వాంగ్మూలాలను క్షుణ్ణంగా స్టడీ చేయనుందని సమాచారం. మొదట రామగుండం కమిషనరేట్ పోలీసులు చేపట్టిన దర్యాప్తుపై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాత సీబీఐ అధికారులు ఓ నిర్ణయానికి రానున్నట్టుగా సమాచారం. వామన్ రావు, నాగమణిల హత్యకు గల కారణాలు నిందితులు చెప్తున్న విషయాలను పరిశీలించడంతో పాటు కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అన్న కోణంలోనూ సీబీఐ ఆరా తీయనుంది. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్టుగా సమాచారం.

GATTU VAMAN RAOLatest NewsPV Nagamanitelangana newsTG NEWS