దిశ దశ, జాతీయం:
సరిహద్దుల్లో మల్లీ జూదం మొదలైంది. మల్టిపర్పస్ సొసైటీ పేరిట అనుమతికి మించి టేబుళ్లు ఏర్పాటు చేసి పేకాట క్లబ్ నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. లైసెన్స్ వైన్ షాపును మరిపించే విధంగా అక్కడ దర్జాగా మద్యం అమ్మకాలు కూడా సాగుతున్నాయి.
తెలంగాణా వారే…
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సరిహధ్దు ప్రాంతంలోని పోడ్సాలో ఏర్పాటు చేసిన క్లబ్ లో ఇష్టారీతిన పేకాట సాగుతోంది. రూ. 5 వేలు, 10 వేలు, 20 వేలు, 30 వేల చొప్పున ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేసిన నిర్వాహాకులు దర్జాగా జూదం నిర్వహిస్తున్నారు. తెలంగాణాలో జూదం ఆడేందుకు క్లబ్బులకు అనుమతి లేకపోవడంతో సరిహద్దు జిల్లాలకు చెందిన ప్లేయర్స్ ను తరలించుకపోయేందుకు ప్రత్యేకంగా ఫంటర్లను కూడా నియమించుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన ప్లేయర్స్ ను తీసుకెళ్లేందుకు ఫంటర్లు దర్జాగా ప్రచారం సాగిస్తున్నారు. వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుని మరీ పోడ్సా క్లబ్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటే ఫంటర్స్ కు మల్టిపర్పస్ సొసైటీ నిర్వాహాకులు ఏ స్థాయిలో కమిషన్లు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వీరితో పాటు ప్రైవేటు ట్యాక్సీలకు కూడా ఒక్కొక్కరికి రూ. 3,500ల వరకూ చెల్లిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అనుమతి లేకుండానే రెస్టారెంట్ ను మరిపించే విధంగా శాఖాహార, మాంసాహారాలను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన వందాలది మంది ప్లేయర్లు పోడ్సా క్లబ్ వైపునకు పరుగులు తీస్తున్నారు. సిర్పుర్ కు పది కిలోమీటర్ల దూరంలోనే ఈ క్లబ్ నిర్వహిస్తుండడంతో ఈ ప్రాంత వాసులు అక్కడకు వెల్లేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.
నిబంధనల సంగతేంటీ..?
మల్టీ పర్పస్ సొసైటీ పేరిట నిర్వహిస్తున్న ఈ జూదం కేంద్రంలో పది టేబుళ్ల వరకే అనుమతి తీసుకుని 20 వరకు టేబుళ్లను కొనసాగిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. చంద్రపూర్ జిల్లాలోని రాజూరా తాలుకా దాబా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ క్లబ్ 24 గంటలూ నిర్వహిస్తున్నారని సమాచారం. సర్వీస్ చేసేందుకు నియమించిన ప్రత్యేక సిబ్బందికి డ్రెస్ కోడ్ పెట్టి మరీ జూదం ఆడిపిస్తున్నారంటే నిర్వహాకులు ఏ స్థాయిలో సాహసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో జూదం కేంద్రాన్ని నిర్వహించేందుకు అనుమతి ఉందని చెప్తున్నప్పటికీ మల్టీ పర్పస్ సొసైటీలో ఉండాల్సిన ఇతారత్ర సౌకర్యాలు, గేమ్స్ వంటివి కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుందా లేదా అన్నది చంద్రపూర్ జిల్లా అధికారులే తేల్చాల్సిన అవసరం ఉంది. అక్కడ వంటలు కూడా చేస్తున్నందును ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకున్నారా లేదా అన్న విషయంపై కూడా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మల్టీపర్పస్ సొసైటీకి సభ్యులు కాని వారికి ఎలా ఎంట్రీ ఇస్తున్నారు..? ఇందుకు నిబంధనలు ఏం చెప్తున్నాయన్న విషయంపై కూడా చంద్రపూర్ జిల్లా అధికారులు ఆరా తీయాల్సిన ఆవశ్యకత ఉంది. దర్జాగా సాగుతున్న ఈ కేంద్రంలో స్థానికేతరులే పెద్ద సంఖ్యలో ఉండడం సరైందేనా లేదా అన్న వివరాలను సేకరించి క్లబ్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మల్టీ పర్పస్ సొసైటీలో సభ్యులు ఎంత మంది ఉన్నారు వారు ఎవరూ..? వారితో సంబంధం లేని వారు ఎందుకు అక్కడ జూదం ఆడుతున్నారు అన్న వివరాలను సేకరించాల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పేకాట ఆడేందుకు మల్టీ పర్పస్ సొసైటీ రూల్స్ అనుమతి ఉంటుందా లేదా అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఒక వేళ గెస్ట్ లను అనుమతించేందుకు నిబంధనలు అనుకూలిస్తే ఆకస్మిక దాడులు చేసి పట్టుకుని అక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారు గెస్ట్ లు ఎంతమంది ఉన్నారో కూడా తెలిసే అవకాశం ఉంటుందని అంటున్న వారూ లేకపోలేదు.
విజయ దశమి…
పోడ్సాలో సాగుతున్న జూదం కేంద్రంపై ‘‘దిశ దశ’’ గతంలో వరస కథనాలను ప్రచూరితం చేసింది. దీంతో తాత్కాలికంగా క్లబ్ ను క్లోజ్ చేసిన నిర్వహాకులు తాజాగా రీ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. విజయ దశమి సందర్భంగా సెలవులు రావడంతో తెలంగాణ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాతోనే ఈ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలో పేకాట రాయుళ్ల కుటుంబాలపై ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో అధికారులు చొరవ తీసుకుని ఈ సొసైటీ నిర్వాహాకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.