Karimnagar: మహాశక్తి ఆలయంలో వార్షికోత్సవాలు…

హాజరు కానన్ను హంపీ పీఠాధిపతి

వేడుకలకు ముస్తాబైన మందిరం

దిశ దశ, కరీంనగర్:

ఆధ్యాత్మికత ఉట్టిపడే కరీంనగర్ సిగలో నగగా మారిన మహాశక్తి ఆలయం వార్షికోత్సవ మహోత్సవానికి ముస్తాబైంది. పదిహేనేళ్ల క్రితం స్థాపించిన ఈ ఆలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చైతన్యపురిలో త్రిశక్తి దేవతలు ఒకే ప్రాంగణంలో వెలిసి మహాశక్తి ఆలయంగా భాసిల్లుతోంది. దేశంలోనే అత్యంత అరుదైన ఆలయాల సరసన నిలుస్తున్న కరీంనగర్ మహాశక్తి ఆలయాన్ని 2010 జూన్ 17న ప్రతిష్టించిన ఈ ఆలయంలో విజయాలను అందించే శ్రీ మహా దుర్గా అమ్మవారు, భోగ భాగ్యాలు, సిరి సంపదలు అందించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, జ్ఞానం అందించే శ్రీ మహా సరస్వతి అమ్మవార్లను ప్రతిష్టించారు. హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య బారతి స్వామి దివ్య ఆశీస్సులతో నిర్మాణం జరిగిన ఈ ఆలయంలో ఆధ్మాత్మిక శోభ ఉట్టిపడుతోంది. నిత్య పూజలతో పాటు హిందూ పర్వదినాల సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పొటెత్తుతుంటారు. ప్రధానంగా విజయదశమి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించే శ్రీ దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వడంతో పాటు రోజూ రాత్రి దాండియా ప్రత్యేకంగా జరుగుతుంటుంది. తరతమ బేధాలు లేకుండా ఇక్కడకు వచ్చే భక్తులు దాండియాలో పాల్గొంటారు. ఉదయం నుండి అమ్మవార్ల పూజలో తరించే సుహాసినిలు రాత్రి దాండియా ఆటతో తమలోని చైతన్యాన్ని ప్రదర్శిస్తుంటారు. భారతీయ సంస్కృతి, సాంప్రాదాయానికి ప్రతీకగా నిలిచే దాండియాను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనం ఇక్కడకు తరలి వస్తున్నారంటే ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే శ్రీరామ నవమిని పురస్కరించుకుని కూడా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంతో పాటు ప్రవచనకర్తలచే ప్రత్యేకంగా ప్రసంగాలు చేయిస్తుంటారు. హిందూ ధర్మం గురించి బోధించే వారిచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి, వసంత పంచమి, శ్రీరామ నవమి, నాగ పంచమి నాగ చవితి, ఉగాది, దీపావళి, వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రతినెల సంకష్ట హర చతుర్థితో పాటు అన్ని ప్రత్యేక రోజుల్లో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం భక్తుల రాకపోకలతో అలరారుతున్న మహాశక్తి ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవాల్లోనూ భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. కరీంనగర్ కార్పోరేషన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న బండి సంజయ్ కుమార్ ఈ ఆలయ నిర్మాణం నిర్వహాణ బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారు.

ప్రత్యేక ఉత్సవాలు…

మహాశక్తి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా జూన్ 1 ఆదివారం నాడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి నేతృత్వంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 4.30 గంటలకు శ్రీలక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు జగద్గురువుల కరకములచే పంచామృతాభిషేకం కార్యక్రమలు జరుగుతాయి. ఉదయం 8 గంటలకు స్వస్తి పుణ్య హవచనము, గణపతి పూజ, అఖండ దీపారాధనము, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర సహిత చండీ హోమము, పూర్ణాహుతి, మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పీఠాధిపతి భక్తులనుద్దేశించి ప్రవచించనున్నారు. కార్పోరేటర్ హోదాలో మహాశక్తి ఆలయ నిర్మాణం జరిపిన బండి సంజయ్ ఆదివారం నాటి వార్షికోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో హాజరవుతున్నారు.

ధార్మిక శోభ…

దశాబ్దన్నర క్రితం కరీంనగర్ చైతన్యపురిలో ప్రతిష్టించిన మహాశక్తి ఆలయం నిత్యం ధార్మికశోభతో అలరారుతోంది. భక్తుల నిత్య పూజలతో పాటు ముగ్గురు అమ్మలను స్మరిస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు దేవి నవరాత్రోత్సోవాల సందర్భంగా మాల ధారణ చేసే భక్తుల సంఖ్య నామమాత్రంగానే ఉంటే నేడు అది వేల సంఖ్యకు చేరుకుంది. దేవి నవరాత్రుల్లో ఓ వైపున ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులు, మరో వైపున మాలా ధారణ చేసుకున్న భక్తులతో మహాశక్తి ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోతుంటుంది. ఈ ఆలయంలో జరగుతున్న ధార్మిక కార్యక్రమాలతో చైతన్యపురి ప్రాంత రహదారులన్ని కూడా భక్తుల రాకపోకలతోనే నిండిపోతుంటాయి. దేశ విదేశాలకు చెందిన భక్తులు కూడా మహాశక్తి ఆలయం గురించి తెలుసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వస్తుంటారు. పూరాతన ఆలయాలు, ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలతో కూడిన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కరీంనగరాన ముగ్గురు అమ్మలను ఒకే ప్రాంగణంలో ప్రతిష్టించినట్టయితే మరింత వన్నె తెచ్చినట్టయింది. పదిహేనవ వార్షికోత్సవాన్ని పురస్కరించకుని మహాశక్తి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

bandi sanjaykarimnagar newsSRI MAHASHAKTHI TEMPLESri Mahashakti Mandirtelangana news