కొండాపూర్ లో బాంబుల మోత…

ఉలిక్కిపడి… ఊపిరి పీల్చుకున్న జనం

దిశ దశ, కోనరావుపేట:

అప్పుడప్పుడే ఆ పల్లె జనం నిద్రలోకి జారుకుంటున్నారు. రాత్రి 9 గంటలు దాటడంతో నిశ్శబ్దంలోకి చేరుకుంటున్న ఆ ఊరిలో ఒక్కసారిగా పేలుళ్ల మోతలు దద్దరిల్లిపోవడంతో గ్రామస్థులంతా ఉలిక్కిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి సంభవించిన పేలుళ్లతో గ్రామస్థులు కొద్దిసేపు అయోమయానికి గురి కాగా అసలు విషయం తెలుసుకున్న తరువాత ఊపిరి పీల్చుకున్నారు. ఒకప్పడు జనశక్తికి పెట్టని కోటగా ఉన్న కోనరావుపేట మండలంలో అనూహ్యంగా పేలుడు సంభవించడంతో అంతా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అవి ఓ ఇంట్లో నిల్వ ఉంచినవేనని తెలిసి కొండాపూర్ వాసులు కుదుటపడ్డారు. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో నిలువ ఉంచిన జిలిటెన్ స్టిక్స్ పేలిన సంఘటన కలకలం సృష్టించింది. చివరకు గతంలో జిలిటెన్ స్టిక్స్ వ్యాపారం చేసే వ్యక్తి ఇంట్లో నిలువ ఉంచినవి కావడం విశేషం. ప్రస్తుతం అనారోగ్యానికి గురైన సదరు వ్యక్తి బయట తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఇంతకముందు తీసుకొచ్చి స్టాక్ పెట్టుకుని ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. జిలిటెన్ స్టిక్స్ పేలడంతో గ్రామంలోని సదరు వ్యక్తితో పాటు సమీపంలోని కొన్ని ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపాలని స్థానికులు కోరుతున్నారు.

crimecrime newsCRIME TODAYLatest Newsrajanna siricilla districttelangana news