Maoist News: ఆ టీంలో పక్కా లోకల్… హిడ్మా సెల్ఫ్ ప్రొటెక్షన్…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ఆ కీలక నేత స్వీయ రక్షణ చర్యలు పకడ్భందీగా తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలను మట్టుబెట్టడంలో తనదైన ప్రత్యేకతను కనబర్చే ఆయన తన వెంట నడిచే బృందంలో ఎవరెవరు ఉండాలి అన్న విషయంపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటున్నారు. తన టీంలో ఉండే వారిని స్వయంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. మిలటరీ ప్లాటూన్ కమాండర్ గా, కేంద్ర కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆ నేత తన బృందంలో పక్కా లోకల్ అంటూ ముందుకు సాగుతున్నారు.

స్వీయ రక్షణ చర్యలా?

సుక్మా జిల్లా పువ్వర్తికి చెందిన మడావి హిడ్మా దండకారణ్యంలో చేపట్టిన ప్రతి ఆపరేషన్ కూడా సంచలనమే. హిడ్మా ఇప్పటి వరకు రెండు వందలకు పైగా కేంద్ర బలగాలను చంపి ఉంటాడని ఓ అంచనా. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మా గత కొంత కాలంగా స్వీయ రక్షణ చర్యలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆయన బృందంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేడర్ ను తప్పించి వారిని మావోయిస్టు పార్టీలోని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. తనకు అత్యంత నమ్మకమైన వారిని మాత్రమే తన బృందంలో ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటానని కేంద్ర కమిటీ సమావేశంలో చెప్పినట్టు సమాచారం. అప్పటి నుండి దండకారణ్య ప్రాంతానికి చెందిన ఆదివాసీ యువతను మాత్రమే తన బృందంలో నియమించుకున్నట్టు సమాచారం.

ఆపరేషన్ స్పెషల్…

ఇకపోతే హిడ్మాకు ఆపరేషన్లు కూడా స్వయంగా నిర్వహించడంలో దిట్టగా పేరుంది. బలగాలను హతమార్చేందుకు రెక్కీ నుండి మొదలు లక్ష్యం చేధించేవరకు కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నట్టుగా సమాచారం. మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా ఉన్న బస్తర్ అటవీ ప్రాంతంలో అణువు అణువు తెలిసిన మడావి హిడ్మా అలియాస్ సంతోష్ నేతృత్వంలో చేపట్టిన దాడులు సంచలనాలేనని చెప్పవచ్చు. మైన్ ప్రూఫ్ వాహనాల్లో ప్రయాణిస్తున్న CRPF బలగాలను లక్ష్యం చేసుకుని మందుపాతరలు పేల్చివేసిన ఘటన జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో 76 మంది జవాన్లు చనిపోగా మైన్ ప్రూఫ్ వాహనాలపై అప్పటికే ఎనాలిసిస్ చేసిన పార్టీ ముందుగా మందుపాతర పేల్చివేసి ఆ వాహనాల నుండి బయటకు వస్తున్న జవాన్లు చంపేందుకు అంబూష్ చేసి దాడి చేసేలా వ్యూహం రచించింది. జీనాగూడ, పువ్వర్తి అటవీ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడి మరీ 20 మందికి పైగా బలగాలపై ముప్పేట దాడి చేసిన ఘటనతో పాటు కీకారణ్యాల్లో బలగాలను చుట్టు ముట్టి కాల్పులు జరిపిన ఎన్నో ఘటనలకు హిడ్మానే నాయకత్వం వహించారు.

ఒకేసారి…

ఇప్పటి వరకు మడావి హిడ్మాను కేవలం ఒక్కసారి మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత బయటకు వచ్చిన హిడ్మా ఇంతవరకూ పోలీసులకు చిక్కలేదు. 1981లో జన్మించిన హిడ్మా పదో తరగతి వరకు చదువుకుని పార్టీలో చేరి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగిన అతి పిన్న వయస్కుడు కావడం గమనార్హం. సీసీ కమిటీతో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్ గా వ్యవహరిస్తున్న హిడ్మా టీంలో అంతా కూడా తనకు నచ్చిన వారిని, విశ్వసనీయులను మాత్రమే నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. తన వెంట ఉండేవారికి కూడా వ్యూహాల గురించి పూర్తి స్థాయిలో వివరించకుండా సీక్రసీ మెయింటెన్ చేయడంలో హిడ్మా పకడ్భందీగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. తాను నిర్దేశించిన పనిలో నిమగ్నం అయ్యే వారు మాత్రమే తన టీంలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న హిడ్మా నైట్ జర్నీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడని సమాచారం. డే టైంలో షెల్టర్ జోన్ లకు పరిమితం అయి రాత్రి వేళల్లో మాత్రమే నడుచుకుంటూ వెల్తాడని సమాచారం. ఇటీవల కాలంలో మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించడంతో సెల్ఫ్ ప్రొటెక్షన్ విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. కర్రెగుట్టల సమీపంలో హిడ్మా కదలికలను గుర్తించిన బలగాలు ఆ ప్రాంతంలో మోహరిస్తున్న క్రమంలోనే అక్కడి నుండి సేఫ్ జోన్ కు వెళ్లిపోగా, తాజాగా నేషనల్ పార్క్ ఏరియాలోనూ బలగాల కళ్లుగప్పి తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది.

టార్గెట్ ఆయనే…

కేంద్ర కమిటీలోని ఇతర నాయకుకంటే ఎక్కువగా మడావి హిడ్మానే మెయిన్ టార్గెట్ గా బలగాలు ముందుకు సాగుతున్నాయి. హిడ్మా పట్టుబడితే మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని చవి చూస్తుందని అంచనా వేస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గించుకున్న నేపథ్యంలో హిడ్మా ఖచ్చితంగా దొరుకుతాడని ఆయన కోసమే గాలింపు చర్యలు చేపట్టాలని భావిస్తున్నాయి.

bastarchhattisgarhDANDKARNYAMmaoist hidmaMAOIST PARTY