సన్న బియ్యమూ స్మగ్లింగ్… దారి మళ్లుతున్న రేషన్ రైస్…

ధర పెంచిన వ్యాపారులు…

దిశ దశ, కరీంనగర్:

పీడీఎస్ రైస్ సరఫరాలో సమూల మార్పులు తీసుకొచ్చినా అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో దొడ్డు బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఇంతకాలం స్మగ్లిర్ల ఇష్టారాజ్యం నడిచింది. అయితే రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం సరఫరా చేసినట్టయితే లబ్దిదారులు సద్వినియోగం చేసుకుంటారని భావించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా సన్న బియ్యం సరఫరా చేయడం మొదలు పెట్టింది. ఆహార భద్రతా కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం సరఫరా చేస్తుండడంతో అవి దారి మళ్లే అవకాశం ఉండదని వేసిన అంచనాలు తలకిందులు అవుతున్నట్టుగా తెలుస్తోంది.

రూ. 24

రూ. 18కి కిలో చొప్పున దొడ్డు బియ్యం కొనుగోలు చేసిన వ్యాపారులు సన్న బియ్యాన్ని మాత్రం రూ. 24ల చొప్పున కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సన్న బియ్యానికి పొరుగునే ఉన్న మహారాష్ట్రలో అంతగా డిమాండ్ లేకున్నప్పటికీ తెలంగాణలోని రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం మాత్రం నల్లబజారుకు తరలివెల్లిపోతూనే ఉన్నాయి. గతంలో 80 నుండి 90 శాతం బియ్యం స్మగర్ల ద్వారా రవాణా కాగా ఇప్పుడు 40 శాతం వరకూ పీడీఎస్ రైస్ అక్రమ రవాణా అవుతున్నట్టుగా తెలుస్తోంది. సన్న బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారం అందుకున్న తెలంగాణ సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం అధికారులు మొదట్లో దాడులు చేశారు. రేషన్ దుకాణాలకు చేరాల్సిన సన్న బియ్యం కూడా దారి మల్లుతున్నాయని రెడ్ హైండెడ్ గా పట్టుకుని నిరూపించారు. అయితే ఆ తరువాత విజిలెన్స్ అధికారుల దాడులు నామమాత్రం కావడంతో నెమ్మదిగా వ్యాపారులు సన్న బియ్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు తమ పావులు కదుపుతునర్నారు. మహారాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రానికి మంచిర్యాల జిల్లా చెన్నూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రాంతం మీదుగా సన్న బియ్యం సరఫరా అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో మాదిరిగానే కమిషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న బడా వ్యాపారులు వారికి కిలోకు రూ. 2 వరకు కమిషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న సన్న బియ్యాన్ని సేకరించేందుకు సదరు వ్యాపారుల నెట్ వర్క్ అంతా గ్రామాల్లో పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సరిహద్దు గ్రామాలకు చేరుకుంటున్న రేషన్ బియ్యం గోదావరి నది దాటి సిరొంచకు తరలిపోతున్నాయి. అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న ఈ బియ్యాన్ని మహారాష్ట్రలోని వివిధ పట్టణాల్లోని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్టుగా సమాచారం.

హైవే సాక్షిగా…

సిరొంచతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతానికి కూడా రేషన్ బియ్యం సేకరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ మార్గ మధ్యలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో రేషన్ బియ్యం సేకరించే వ్యాపారులు దర్జాగా తమ దందా కొనసాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రేషన్ బియ్యం ఈ ప్రాంతానికి చేరుకున్న తరువాత వాటి సంచులు మార్చి బహిరంగ మార్కెట్ లో రూ. 40 నుండి 45లకు విక్రయిస్తున్నట్టుగా సమాచారం. అయితే మహారాష్ట్రలోని సిరొంచ, తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ రహదారిలోని రైల్వే స్టేషన్ సమీపంలోని రెండు షెల్టర్ పాయింట్లు కూడా ప్రధాన రహదారుల సమీపంలోనే ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తుండడం గమనార్హం.

ఏసీబీ…

పీడీఎస్ రైస్ దందాల్లో పోలీసులు మామూళ్లు అడుగుతున్నారని, లారీలను వదిలేందుకు చేతులు తడపాలని డిమాండ్ చేస్తున్నారని వ్యాపారులు అవినీతి నిరోశధక శాఖ అధికారులను ఆశ్రయించిన సందర్భాలూ ఉన్నాయి. లంచం ఇస్తూ పోలీసు అధికారులను రెడ్ హైండెడ్ గా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న వ్యాపారులు ఏసీబీ పట్టించిన ఘటనలూ ఉన్నాయి. వీటి ఆధారంగా సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం దర్యాప్తు ఎందుకు చేయడం లేదన్నది కూడా అంతు చిక్కకుండా పోతోంది. రేషన్ బియ్యం అంత పెద్ద మొత్తంలో ఎక్కడకు తరలి వెలుతున్నాయి..? ఆ బియ్యానికి పోలీసులను ఏసీబీకి పట్టించిన వ్యాపారికి ఏం సంబంధం ఉంది..? అసలు ఆ వ్యాపారి ఆ బియ్యాన్ని అంత పెద్ద మొత్తంలో సేకరించడానికి కారణం ఏంటీ అన్న సమగ్ర వివరాలను తెలుసుకుని సివిల్ సప్లై చట్టాలకు పని చెప్పినట్టయితే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల స్మగ్లింగ్ చేస్తున్న వ్యాపారుల ఆటలకు కూడా చెక్ పడినట్టయ్యేదని, అంతేకాకుండా సన్న బియ్యం దారి మల్లే అవకాశం కూడా ఉండకపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Latest Newspds rice smuglingRation ricesironchaTG NEWS