కోడె మొక్కుల ఉద్యోగి చేతి వాటం… రాజన్న ఆలయంలో ఇష్టారాజ్యం

దిశ దశ, వేములవాడ:

భక్తులకు కొంగు బంగారంగా కొలువైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో పర్యవేక్షణ కొరవడింది. ఆలయ ప్రాంగణంలో ఎవరేం చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. అన్య మతస్థులు ఈఓ కార్యాలయం, ధర్మ గుండం పరిసర ప్రాంతాల్లో మాంసాహార ప్యాకెట్లను పంపిణీ చేసిన విషయం మరవకముందే ఉద్యోగి చేతి వాటం ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భాలయం ముందు ఉన్న కోడె మొక్కుల స్తంభం వద్ద భక్తుల వద్ద దర్జాగా డబ్బులు వసూలు చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడె మొక్కులు తీర్చేందుకు భక్తులు రాజన్న గర్భాలయం ముందు నుండి ప్రదక్షిణలు చేస్తుంటారు. మొక్కుకు సంబంధించిన టికెట్ కౌంటర్ లో తీసుకుని వస్తేనే భక్తులకు కోడెను అప్పగిస్తారు. కానీ శనివారం ఉదయం జరిగినట్టుగా తెలుస్తున్న ఈ ఘటనలో మాత్రం నేరుగా భక్తులు అక్కడ ఉన్న ఓ వ్యక్తికి డబ్బులు ఇస్తున్నట్టుగా స్పష్టంగా రికార్డు అయింది.

Latest Newssri raja rajeshwara templetelangana newsvemulawada