N0 GST… NO IT…

గ్రానైట్ పరిశ్రమల సరికొత్త పంథా…

దిశ దశ, కరీంనగర్:

జీరో పర్మిట్లు… జీరో బిల్లింగ్ దందా వ్యవహారంతో భారీ స్కాం  జరుగుతున్నట్టుగా ఉంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా ట్యాక్సులను ఎగవేసేందుకు వ్యాపారులైనా, పరిశ్రమల యజమానులైనా సర్కారు నెత్తిన కుచ్చుటోపి పెట్టేందుకు ఏ మాత్రం వెనకాడరు. ఇందులో గ్రానైట్ పరిశ్రమల విషయంలో అయితే మరీ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయా విభాగాల యంత్రాంగం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో పరిశ్రమల యజమానులు కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీగా కోత పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఆ రెండింటి విషయంలో…

గ్రానైట్ పరిశ్రమల యజమానుల నెల కాగానే ఠంఛనుగా విద్యుత్ బిల్లు, లోన్ ఈఎంఐలు చెల్లిస్తున్నప్పటికీ జీఎస్టీ, ఐటీ మాత్రం చెల్లించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని పరిశ్రమల యజమానులు సిండికేట్ అయి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్ క్వారీల నుండి రా మెటిరియల్ బ్లాకులను పర్మిట్ల రీ సైక్లింగ్ ద్వారా పరిశ్రమలకు తరలిస్తు, గ్రానైట్ ప్లేట్లుగా తీర్చిదిద్దిన తరువాత వాటిని దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు కానీ జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్ చెల్లించడం లేదని తెలుస్తోంది. ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లించనట్టయితే సరఫరా నిలిపివేస్తారని, పరిశ్రమలపై తీసుకున్న రుణాల తాలుకు ఈఎంఐ చెల్లించనట్టయితే రికవరీ కోసం బ్యాంకర్లు రంగంలోకి దిగుతారన్న కారణంతో ఈ రెండింటిని చెల్లించి సరిపెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే జీఎస్టీ చెల్లించేందుకు విముఖత చూపుతున్నారని… దీంతో ఇన్ కం ట్యాక్స్ కూడా చెల్లించకుండా తప్పించుకునే అవకాశం దొరికినట్టయిందని సంబరపడిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా అటు GST, IT చెల్లించకుండానే పరిశ్రమల్లో గ్రానైట్ క్రయవిక్రయాలు జరుపుతుండడం విశేషం.

అరా తీస్తే..?

కమర్షియల్ ట్యాక్స్, ఇన్ కం ట్యాక్స్ విభాగాలకు చెందిన అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసినట్టయితే భారీ స్కాం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పరిశ్రమల వారిగా ప్రతి నెల చెల్లిస్తున్న విద్యుత్ బిల్లులు, లోన్ల తాలుకు ఈఎంఐలు చెల్లిస్తున్న తీరుపై అధికారికంగా లెక్కలు తీసినట్టయితే అసలు విషయం బయట పడే అవకాశం ఉంది. పరిశ్రమలు రా మెటిరియల్ తరలించకుండా గ్రానైట్ ప్లేట్లు విక్రయించకుండా రూ. లక్షల్లో విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారంటే మిషనరీ ఏ అవసరాలకు ఉపయోగిస్తున్నారోనన్నదే అసలు ప్రశ్న. అంతే కాకుండా అసలు వ్యాపారమే చేయనట్టయితే ప్రతి నెల బ్యాంకులకు లోన్ల తాలుకూ ఈఎంఐలు ఏ ఆదాయం ద్వారా చెల్లిస్తున్నారో కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గ్రానైట్ వ్యాపారమే చేయనట్టయితే విద్యుత్ బిల్లులు మినిమమ్ ఛార్జి చెల్లించి సరిపెట్ట వచ్చు కానీ లక్షలాది రూపాయల బిల్లు రావడానికి కారణమేంటన్నది ఆయా పరిశ్రమల యజమానులకే తెలియాలి. గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ కోసం మిషనరీ ఉపయోగించనట్టయితే విద్యుత్ వినియోగం భారీగా ఎందుకు అవసరం పడుతుందన్నది తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే రుణాలకు సంబంధించిన ఈఎంఐలు చెల్లిస్తున్నారంటే… ఇందుకు అవసరమైన ఆదాయం ఎలా వస్తోందన్న విషయంపై జీఎస్టీ, ఇన్ కంట్యాక్స్ అధికారులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక వేల నిజంగానే గ్రానైట్ పరిశ్రమలు పనిచేనట్టయితే ఆదాయం లేదని బ్యాంకులకు నెల వారి వాయిదాలు చెల్లించకుండా ఉంటారు కదా అన్న చర్చ కూడా సాగుతోంది. తమకు సబ్సీడీలు రావడం లేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు చెల్లించలేకపోతున్నామని కొన్ని పరిశ్రమలను అమ్ముకుంటున్నట్టుగానే మిగతా వారు కూడా వాటిని తీసేవేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమల జోన్ లో కొంతమంది యజమానులు పరిశ్రమలను విక్రయించడమో లేక బ్యాంకులకు అప్పగించడమో చేస్తున్నారు. కానీ కొన్ని పరిశ్రమలు జీఎస్టీ, ఐటీ చెల్లించుకుండా తప్పించుకుంటూ విద్యుత్ బిల్లులు, రుణాల వాయిదాలు ఠంచనుగా ఎలా కడుతున్నారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

రెండింటికి లింక్…

పరిశ్రమల యజమానులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. జీఎస్టీ చెల్లించినట్టయితే ఐటీ చెల్లించాల్సి వస్తోందన్న కారణంగా రెండింటికి ఎగనామం పెడుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కమర్షియల్ ట్యాక్స్, ఇన్ కం ట్యాక్స్ అధికారులు గ్రానైట్ పరిశ్రమలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించినట్టయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు ఎగవేస్తున్న వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా క్వారీల నుండి జీరోగా తరలిస్తున్న తీరుపై కూడా బట్టబయలు కానుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతున్న పరిశ్రమలపై పెనాల్టీలు కూడా వేసినట్టయితే మరింత ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది.

Granitegranite scamGstIncome taxtelangana news