దిశ దశ, హైదరాబాద్:
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు జన జీవన స్రవంతిలో కలిశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు సమక్షంలో వీరు మావోయిస్టు పార్టీని వీడారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పని చేస్తున్న వీరిద్దరు కూడా లొంగిపోవడం సంచలనంగా మారింది. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు (DKSZC) రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునిత(గమనం) అలియాస్ గురుస్మృతి అలియాస్ లక్ష్మీ అలియాస్ సరోజ అలియాస్ శారద అలియాస్ భద్రి, ఏరియా కమిటీ బాధ్యునిగా ఉన్న చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీనివాస్ లు సరెండర్ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ముందు వీరిద్దరు లొంగిపోతున్నట్టు ప్రకటించారు.
1986లో…
గురుస్మృతి, మాధవి (గమ్యం) ఇద్దరు అక్కా చెల్లెల్లు పీపుల్స్ వార్ లో చేరారు. వీరిద్దరు కూడా 1985 సంవత్సరం నుండి విప్లవం వైపు అడుగులు వేశారు. తండ్రి కాకరాల సత్యనారాయణ విప్లవ రచయితలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వీరిని తరుచూ సమావేశాలకు తీసుకెల్లేవారు. ఆయన రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ (RWA), విరసం సమావేశాలకు తరుచూ హాజరవుతుండేవారు. ఆయనతో పాటు తన కూతుర్లు గమనం, గమ్యంలను ఈ సమావేశాలకు తీసుకెల్లేవారు. అలాగే విప్లవ రచయితలు తరుచూ సత్యనారాయణ ఇంటికి వచ్చి చర్చలు జరుపుతున్న క్రమంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు విప్లవం వైపు అడుగులు వేశారు. మొదట రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్ యూ)లో ఆ తరువాత పీపుల్స్ వార్ పని చేశారు సునిత. ఏపీలోని విజయవాడ, గుంటూరు సెంట్రల్ ఆర్గనైజర్ గా పని చేశారు. ఇదే సమయంలో పార్టీలో పరిచయం అయిన టీఎల్ఎన్ చలం అలియాస్ గౌతం అలియాస్ సుధాకర్ తో వివాహం అయింది. 1992లో నల్లమల అటవీ ప్రాంతానికి వెల్లిన గురుస్మృతి ఫారెస్ట్ డివిజన్ కమిటీలో బాధ్యతలు నిర్వర్తించారు. 2001 వరకు నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే పని చేసిన సునిత వలికొండ, భైరవకోనల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో పాల్గొన్నారు. 2001లో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు తీసుకున్న ఆమె భర్త ఆంధ్రా ఒడిషా బార్డర్ (AOB)కి వెళ్లారు. పుజారిగూడ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న సునిత 2006లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి వెళ్లారు. చత్తీస్ గడ్ లోని బస్తర్ దండకారణ్య అటవీ ప్రాంతంలో పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ రిక్రూట్ మెంట్ చేసే బాధ్యతలను గురుస్మృతి, ఆమె భర్త సుధాకర్ లు చేపట్టారు. 2014లో కుతుల్ ఎన్ కౌంటర్ లో, 2015 జూన్ నెలల్ నేషనల్ పార్క్ అన్నాపురం ఎన్ కౌంటర్ లో ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు. రీజనల్ పొలిటికల్ స్కూల్(REPOS), ఎడ్యూకేషనల్ డిపార్ట్ మెంటల్ కమిటీల (EDC)లకు సునిత, ఆమె భర్త గౌతంలు ప్రాతినిథ్యం వహించారు. పార్టీ శ్రేణులకు మావోయిస్టు పార్టీ రాజకీయ సైద్దాంతికతను వివరించే పనిలో కూడా నిమగ్నం అయ్యారు. అలాగే మావోయిస్టు పార్టీ అధికారిక పత్రికల్లో ఒకటైన క్రాంతి మ్యాగజైన్ కు ప్రత్యేకంగా వ్యాసాలు కూడా రాశారు. ఆమె భర్త సుధాకర్ కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేస్తూ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ మరణించారు.
తండ్రి వెండితెర…
సునిత తండ్రి కాకరాల సత్యనారాయణ సుదీర్ఘ కాలం తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించారు. దాదాపు 300 వరకూ సినిమాల్లో నటించిన ఆయన వామపక్ష భావజాలంతో ముందుకు సాగారు. ఇంట్లో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేసిన ఆయన విప్లవ భావజాలానికి సంబంధించిన పుస్తకాలను ఎక్కువగా సేకరించే వారు. తన ఇద్దరు కూతుర్లకు గురుస్మృతి, సమత, గమనం, గమ్యం అనే పేర్లతో పిలిచేవారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన కాకరాల సత్యనారాయణ సినిమాల్లో నటించేందుకు చెన్నైలో నివాసం ఏర్పర్చుకోవల్స వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్ కు మకాం మర్చారు. ఇద్దరు కూతుర్లు కూడా విప్లవోద్యమంలో చేరినప్పటికీ వారికి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునేంత స్వేచ్ఛ ఇచ్చానని ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో తెలిపారు. సీఆర్ ఫౌండేషన్ లో ఉంటున్న కాకరాల సత్యనారాయణ భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
ఏసీఎం హరీష్…
రాచకొండ సీపీ సుధీర్ బాబు ముందు లొంగిపోయిన ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్ అలియాస్ రామన్న అలియాస్ శ్రీను జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన వాడు. 2006లో ఏటూరునాగారం బీసీ హాస్టల్ లో పదో తరగతి చదువుతున్నప్పుడు విప్లవ భావజాలానికి ఆకర్షితుడు అయ్యాడు. 2015లో అశ్వినిని వివాహం చేసుకున్న హరీష్ 2010 నుండి 17 వరకు కుటుంబ ఆర్థిక కారణాల దృష్ట్యా వివిధ ప్రాంతంలో ఉపాధి కోసం పని చేశాడు. 2017లో సీపీ బాటలో పని చేసిన హరీష్ 2018లో విప్లవ ఉద్యమం వైపు వెళ్లిపోయాడు. ఓ సారి భద్రాచలంలో అరెస్ట్ కాగా జైలు నుండి బయటకు వచ్చిన తరువాత మళ్లీ పార్టీలోనే చేరాడు.
నాన్న కోసమేనా..?
మావోయిస్టు పార్టీలో సుదర్ఘీ కాలంగా పని చేసిన గురస్మృతి లొంగుబాటకు కారణం ఏంటన్న చర్చ మొదలైంది. విప్లవ భావజాలంతో ఉన్న తండ్రి కడుపున పుట్టిన బిడ్డలు ఇద్దరు కూడా సమసమాజ నిర్మాణం కోసం అడవి బాట్ట పట్టారు. 40 ఏళ్లుగా ఎర్ర జెండా ఎత్తుకుని తిరిగిన వయోభారంతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె చలం అలియాస్ గౌతం వీరికి సెక్యూరిటీగా ఉన్న అడెల్లు భాస్కర్ ఎన్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె రక్షణగా ఉన్న చెన్నూరు హరీష్ కాలికి గాయం కావడంతో జనజీవనంలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరో వైపున సునిత తండ్రి ఇటీవల కొన్ని మీడియా ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన భార్య చనిపోయిందని వివరించిన ఆయన తన కూతుర్లు ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని వెల్లడించారు. ఒంటరైన తన తండ్రికి చేదోడుగా నిలవాలని గురుస్మృతి భావించే బాహ్య ప్రపంచలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది.