Maoist News: జేఎన్టీయూ TO దండకారణ్యం…

శ్రీ విద్య విప్లవ ప్రస్థానం…

దిశ దశ, దండకారణ్యం:

హైదరాబాద్ హఫీజ్ పేటలో అరెస్ట్ చేసిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు నార్ల శ్రీ విద్య అలియాస్ కరుణ అలియాస్ రూప అలియాస్ రూపీని మియాపూర్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. గురువారం ఆమె సోదరుడు నార్ల రవి శర్మ ఇంటి నుండి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో శాంతి చర్చల కమిటీ, పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే పోలీసులు మాత్రం శుక్రవారం అమెను రంగారెడ్డి కోర్టులో హాజరు పరిచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కుట్ర కేసులో శ్రీ విద్య నిందితురాలని పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ సంతానంలో ఒకరైన శ్రీ విద్య హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. ఆమె సొదరు నార్ల రవి శర్మ కూడా పీపుల్స్ వార్ లో చేరి 2009 వరకు మావోయిస్టు పార్టీలో పని చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా, శ్రీవిద్య సోదరి శ్రీదేవి కూడా విప్లవ పంథాలోనే కొనసాగారు. 1992లో అన్న నార్ల రవి శర్మ ప్రోద్భలంతో పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ అయిన చైతన్య మహిళా సమాఖ్యలో పని చేశారు. 2006లో్ అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీ విద్య ఏపీలోని విశాఖపట్నం, ఒడిషాలోని మల్కాన్ గిరి, కోరాపుట్ జిల్లాల్లోని గిరిజనులకు పార్టీ సిద్దాంతాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తరువాత చత్తీస్ గడ్ లోని నారాయణపూర్, కాంకేర్, దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టు పార్టీ సిద్దాంతాలను ప్రచారం చేసి ఆదివాసీల్లో అజ్ఞాత పోరాటంపై చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. శ్రీ విద్య కారణంగా భారీ ఎత్తున పార్టీలో రిక్రూట్ మెంట్ జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం DKSZCలోని EDC సభ్యురాలిగా పని చేస్తున్న శ్రీ విద్య ఏరియా కమిటీ సభ్యురాలిగా, జిల్లా కమిటీ సభ్యురాలిగా, స్టేట్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీష్ ను వివాహం చేసుకున్న శ్రీ విద్యపై తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. పోలీసుల విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితాలో శ్రీ విద్య పేరు కూడా ఉండడం గమనార్హం. అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్ వచ్చని శ్రీ విద్య ఆమె సోదరుడు నార్ల రవి శర్మ ఇంటికి వచ్చినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రీ విద్యపై ఇతర ప్రాంతాల్లో నమోదయిన కేసుల్లోనూ ఆమెను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

chhattisgarhDANDKARNYAMDKSZCmaoist newsMAOIST PARTY